గృహ నిర్బంధంలో కేజ్రీవాల్‌: ఆప్‌

9 Dec, 2020 04:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారని ఆప్‌ ఆరోపించింది. కేజ్రీవాల్‌ మంగళవారం ఉదయం సింఘు వద్దకు వెళ్లి అక్కడ నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతు తెలిపారు. తిరిగి తన నివాసానికి చేరుకున్నారు. అయితే, కేజ్రీవాల్‌ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారనీ, ఆయనకు స్వేచ్ఛ ఇవ్వాలంటూ కొందరు ఆప్‌ ఎమ్మెల్యేలు ఆయన నివాసం వద్ద నినాదాలు చేశారు. సీఎం ఇంట్లోకి పోలీసులు తనను వెళ్లనివ్వలేదని ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా తెలిపారు.  ఈ సందర్భంగా ఆప్‌ ప్రతినిధి సౌరభ్‌ భరద్వాజ్‌ మీడియాతో మాట్లాడారు. ‘కేంద్ర హోం శాఖ సూచనల మేరకే ఢిల్లీ పోలీసులు సీఎం కేజ్రీవాల్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. సీఎం ఇంట్లోకి ఎవరినీ వెళ్లనివ్వలేదు.

లోపలి నుంచి బయటకు వచ్చేందుకు సీఎంను అనుమతించలేదు. మా ఎమ్మెల్యేలు సీఎంను కలిసేందుకు వెళ్లగా పోలీసులు వారిని కొట్టి, బయటకు నెట్టారు’అని తెలిపారు. ఢిల్లీ నార్త్‌ జోన్‌ స్పెషల్‌ పోలీస్‌ కమిషనర్‌ సతీశ్‌ గోల్చా ఈ ఆరోపణలను ఖండించారు. ‘ఢిల్లీ సీఎం కదలికలపై పోలీసులు ఆంక్షలు విధించారంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారాలు’ అని మీడియాకు తెలిపారు. ఆప్‌ ఆరోపణలను బీజేపీ, కాంగ్రెస్‌ ఖండించాయి. అవన్నీ రాజకీయ డ్రామాలని కొట్టిపారేశాయి. కేజ్రీవాల్‌ తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా ఆ పార్టీ నేతలు గృహ నిర్బంధమని చెబుతున్నారని బీజేపీ వ్యాఖ్యానించింది.  కేజ్రీవాల్‌ మోసాలకు పాల్పడుతున్నారని విమర్శించింది. 

>
మరిన్ని వార్తలు