బ్రిటన్‌లో ఫైజర్‌ టీకా మొదలు | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌లో ఫైజర్‌ టీకా మొదలు

Published Wed, Dec 9 2020 4:31 AM

UK Begins Pfizer Covid-19 Vaccine On 90 Years Old Women - Sakshi

లండన్‌: యూకే తన చరిత్రలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుట్టింది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఫైజర్, బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ప్రజలకు  ఇవ్వడం ప్రారంభించింది. ఉత్తర ఐర్లండ్‌కు చెందిన మార్గరెట్‌ కీనన్‌(90) టీకా తీసుకున్న తొలి మహిళగా రికార్డులకెక్కారు.   త్వరలోనే 91వ పుట్టిన రోజు జరుపుకోనున్న మార్గరెట్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.  ఆరోగ్య సిబ్బందితో పాటు, హోమ్‌ కేర్‌ వర్కర్లు, 80 ఏళ్ల వయసు పై బడినవారికి తొలి ప్రాధాన్యంగా ఈ టీకా ఇవ్వనున్నారు. మొదటి డోసు ఇచ్చిన 21 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారు. కాగా, కరోనా మహమ్మారిని అరికట్టడానికి బ్రిటన్‌ చేస్తున్న పోరాటంలో ఇదో ముందడుగు అని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అన్నారు.  ‘టీకా డోసులు అందడానికి వారాలు, నెలలు అంతకంటే ఎక్కువ సమయమే పడుతుంది. అంతవరకు అందరూ కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. మాస్కులు, చేతులు శుభ్రం, భౌతికదూరం పాటించండి’ అని  ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  

భారత సంతతి జంటకు..
బ్రిటన్‌లో భారతీయ సంతతికి చెందిన దంపతులు డాక్టర్‌ హరి శుక్లా (87), ఆయన భార్య రంజన్‌ (83)కు ఫైజర్‌ వ్యాక్సిన్‌ను ఇచ్చారు. న్యూకేజల్‌ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తొలి భారతీయ జంట వీరే.  హరిశుక్లా తండ్రి ముంబై నుంచి కెన్యాకి వెళ్లి స్థిరపడ్డారు. 

వ్యాక్సిన్‌ మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌
కరోనా వ్యాక్సిన్‌ మరింత సమర్థవంతంగా, సురక్షితంగా పని చేయడానికి ప్రయోగాత్మకంగా రెండు వ్యాక్సిన్లు కలిపి ఇవ్వాలని బ్రిటన్‌ యోచిస్తోంది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ– ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు త్వరలోనే అనుమతులు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకి ఇవ్వాల్సిన రెండు టీకాల్లో ఒకటి ఆక్స్‌ఫర్డ్, మరొకటి ఫైజర్‌ ఇవ్వాలని వైద్య నిపుణులు యోచిస్తున్నట్టుగా ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ టాస్క్‌ఫోర్స్‌ వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్‌ టీకాకి అనుమ తులు లభించిన తర్వాత వచ్చే నెలలో ప్రయోగా త్మకంగా ఈ కంపెనీలు అభివృద్ధి చేసిన టీకా డోసులు చెరొకటి ఇచ్చి చూడనున్నారు.మోడర్నా టీకాకి అనుమతులు మంజూరైతే దానినీ టీకాల మిక్స్‌ అండ్‌  మ్యాచ్‌ జాబితాలో చేర్చనున్నారు. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్‌లు 95% సామర్థ్యంతో పని చేస్తే, ఆక్స్‌ఫర్డ్‌ టీకా సగం డోసు ఇచ్చిన వారిలో 90% సమర్థతతో పని చేసింది.  

Advertisement
Advertisement