నకిలీ టీచర్లకు ప్రమోషన్లు.. దర్జాగా విద్యార్థులకు పాఠాలు.. 14 ఏళ్ల ముసుగు తొలగిందిలా!

20 Aug, 2023 07:24 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ పోలీసులు ఇద్దరు నకిలీ టీచర్లను అరెస్టు చేశారు. వీరు నకిలీ డాక్యుమెంట్ల సహాయంతో 14 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఈ టీచర్లిద్దరూ కాన్పూర్‌లోని దేహాత్‌ ‍ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఇంతేకాదు వీరిద్దరికీ ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించి, హెడ్‌మాస్టర్లను చేసింది. ఈ విషయం వెల్లడికావడంతో అటు విద్యావిభాగంతో పాటు ఇటు సామాన్యులలోనూ కలకలం చెలరేగింది. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం 2009లో నకిలీ విద్యార్హతల ధృవపత్రాలతో అనిల్‌ కుమార్‌, బ్రజేంద్ర కుమార్‌లు టీచర్‌ ఉద్యోగాలు సంపాదించారు. దేహాత్‌ పరిధిలోని ఝీంఝక్‌లో ఉంటున్న అనిల్‌ ములాయి ప్రాథమిక పాఠశాల హెడ్‌మాస్టర్‌. అలాగే బ్రజేంద్ర కుమార్‌ షాహ్‌పూర్‌ మోహ్రా ప్రాథమిక పాఠశాల హెడ్‌మాస్టర్‌గా ఉన్నారు.

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి..
బర్రా పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ నూర్య బలిపాండే మీడియాతో మాట్లాడుతూ బర్రాకు చెందిన సందీప్‌ రాథౌడ్‌ ఏడాది క్రితం అంటే 2022లో గ్వాలియర్‌లో ఉంటున్న అతని బంధువు రాజీవ్‌ తనను మోసగించాడంటూ ఫిర్యాదు చేశాడన్నారు. రాజీవ్‌తో పాటు అతని తల్లి, సోదరి కలసి తనకు టీచర్‌ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ. 34 లక్షలు తీసుకున్నారనని సందీప్‌ తన ఫిర్యాదులో ఆరోపించాడు. ఈ పనిలో కాన్పూర్‌కు చెందిన రామ్‌శరణ్‌, అతని దగ్గర పనిచేసే ధర్మేంద్రల హస్తం కూడా ఉన్నదని పేర్కొన్నాడు. వీరంతా తాను టీచర్‌ అయ్యేందుకు కావలసిన నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని తెలిపాడు. అయితే ఇలా దొంగ సర్టిఫికెట్లతో టీచర్‌ ఉద్యోగం చేసేందుకు సందీప్‌ నిరాకరించాడు. ఫలితంగా తన డబ్బు కూడా తిరిగి రాలేదని సందీప్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

పోలీసుల దర్యాప్తులో మరిన్ని కొత్త విషయాలు వెలుగు చూశాయి. రాజీవ్‌ నకిలీ ధృవపత్రాలతో ఇద్దరికి టీచర్‌ ఉద్యోగాలు ఇప్పించినట్లు పోలీసులు గుర్తించారు. వారు అనిల్‌ కుమార్‌, బ్రజేంద్రలుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ గత 14 ఏ‍ళ్లుగా కాన్పూర్‌లోని దెహాత్‌ పాఠశాలలో టీచర్లుగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. పోలీసులు వీరికి సంబంధించిన రికార్డులు చెక్‌ చేయగా, వీరి దగ్గరున్నవి దొంగ సర్టిఫికెట్లని గుర్తించారు. దీంతో వీరిద్దరినీ అరెస్టు చేశారు. 

ఈ విషయమై ఏడీసీపీ అశోక్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారని, వారు నకిలీ పత్రాలతో ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగాలు పొందారని గుర్తించామని తెలిపారు. అయితే వీరికి ఉద్యోగాలు ఇప్పించిన రాజీవ్‌ సింగ్‌  హైకోర్టు నుంచి అరెస్టు వారెంట్‌పై స్టే తెచ్చుకున్నాడన్నారు. ఈ ఉదంతంతో ప్రమేయం ఉన్న రామ్‌ కశ్యప్‌ను కొద్ది రోజుల క్రితమే అరెస్టు చేసి, జైలుకు తరలించామన్నారు. 
ఇది కూడా చదవండి: ‘హార్మోనియం’ను నెహ్రూ, ఠాగూర్‌ ఎందుకు వ్యతిరేకించారు? రేడియోలో 3 దశాబ్దాల నిషేధం వెనుక..

మరిన్ని వార్తలు