సర్వేలో చేదు నిజాలు.. యువతలో గుండె సమస్యలు తీవ్రం

4 Oct, 2022 08:49 IST|Sakshi

బెంగళూరు యువతలో  తీవ్రతరమౌతున్న గుండె సమస్యలు

25 ఏళ్ల నుంచే ఆస్పత్రులకు పరుగులు  

ఒత్తిడి జీవితంతోనే అసలు ముప్పంటున్న నిపుణులు

ఆరోగ్య రాజధాని బెంగళూరులో యువత గుండె ఒత్తిడితో సమతమవుతోంది. మంచి చదువులు, ఉద్యోగం, ఇంకా రకరకాల లక్ష్యాలతో విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల వయసుకు మించిన ఒత్తిడిని హృదయం అనుభవిస్తుంది. దీనికి తోడు అధిక కొవ్వు, చక్కెరలతో కూడిన ఆహారం వల్ల ఆరోగ్యం ఆస్పత్రి పాలయ్యే ప్రమాదం పెరిగింది. నగరంలోని ప్రముఖ గుండె వైద్య ఆస్పత్రులకు పెరిగిన రోగుల తాకిడే దీనికి నిదర్శనమంటున్నారు.  

బనశంకరి: ఐటీ బీటీ సిటీలో ఉద్యోగాలంటేనే ఉరుకులు, పరుగులు లాంటి యాంత్రిక జీవనానికి సరి సమానం. ఎంతో ఒత్తిడితో కూడుకున్న జీవనశైలితో రాజధాని నగర ప్రజలను తీవ్రమైన గుండె సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రముఖ హృద్రోగ ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య కూడా గణనీయ ప్రమాణంలో పెరగడం దీనికి నిదర్శనంగా భావించాలి. అందులోనూ యువత, మధ్య వయసువారే ఎక్కువగా గుండె పోటుకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది.  

గ్రామీణుల కంటే 30 శాతం అధికం 
బెంగళూరు మహానగర వాసులు గ్రామీణ ప్రాంతాలవారి కంటే 30 శాతానికి పైగా గుండె సమస్యలతో బాధపడుతున్నారు. దేశంలోని మహానగరాల్లో ఒకటైన బెంగళూరు నగరంలో హెచ్చుమీరిన వాయు కాలుష్యం, ట్రాఫిక్, ఒత్తిడితో కూడుకున్న జీవితంతో చిన్ని గుండె త్వరగా అలసిపోతోంది. దీంతో పాటు వందలో 50 శాతం మంది శారీరక కదలికలు లేని ఉద్యోగాలు, వ్యాయామం చేయకపోవడం వల్ల గుండె బలహీనానికి లోనవుతోందని వైద్య నిపుణులు తెలిపారు.  

కరోనా తరువాత మరింత ఎక్కువ  
నగరంలోని ప్రముఖ హృద్రోగ ఆసుపత్రి నారాయణమల్టీ స్పెషాలిటిలో కరోనా అనంతరం  55 ఏళ్లు వయసు కంటే తక్కువ వయసు ఉన్నవారు గుండె సమస్యలతో రావడం 30 శాతం పెరిగింది. గత ఒక ఏడాదిలో నమోదైన మొత్తం రోగుల్లో 70 శాతం మంది  25–55 వయసు మధ్యవారేనని తెలిపారు. 
జయదేవ హృద్రోగ ఆసుపత్రిలో ఏడాదికి సరాసరి 6 లక్షల మందికి పైగా ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్నారు. యాంజియోగ్రాం, యాంజియోప్లాస్టితో పాటు 40 వేల శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చే ప్రతి 100 మందిలో 30 మంది 40 ఏళ్లు లోపు వయసు వారు సగం మంది ఉన్నారు.  

40 ఏళ్లు దాటితే స్కాన్‌ చేయించాలి  
 గుండెపోటు ఒకేసారి రాదు కనీసం 10 ఏళ్లకు ముందుగానే గుండెరక్తనాళాల్లో రక్తప్రసరణ తలెత్తుతుంది. 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ 10 ఏళ్లకు ఒకసారి గుండె కు సీటీ స్కాన్‌ తీయించుకోవాలి. ఈ పరీక్షతో 5 శాతం రక్తనాళాలు బ్లాక్‌ అయి ఉంటే తెలుస్తుంది. దీంతో ప్రారంభ సమయంలోనే చికిత్స తీసుకుంటే గుండె జబ్బుల  నుంచి దూరంగా ఉండవచ్చునని ప్రముఖ గుండెవైద్య నిపుణుడు డాక్టర్‌ దేవీ శెట్టి సలహా ఇచ్చారు. 

ఒత్తిడి జీవన విధానమే కారణం  
ప్రస్తుతం ప్రజలు అత్యంత ఒత్తిడితో కూడుకున్న జీవనశైలితో జీవనం గడుపుతున్నారు. ఒక ఏడాది పని ఒక నెలలో పూర్తిచేయాలనే మానసిక స్థితిని కలిగి ఉన్నారు. విద్యార్థి దశ నుంచి ఒకేసారి రెండు మూడు కోర్సులు ప్రారంభించి, మంచి ఉద్యోగం, మరింత డబ్బు సంపాదించాలనే ఆరాటానికి గురవుతున్నారని జయదేవ హృద్రోగ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ సీఎన్‌. మంజునాథ్‌ తెలిపారు.

ఓ సర్వేలో చేదు నిజాలు  
సమగ్ర ఆరోగ్య కేంద్ర సంస్థ ప్రాక్టో దేశంలోని ప్రముఖ మహానగరాల్లో జరిపిన పరిశోధనల్లో మూడునెలల్లో బెంగళూరులో గుండెపోటుకు సంబంధించిన ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు 200 శాతం పెరిగినట్లు తెలిపింది. గత రెండేళ్లలో గుండె జబ్బులతో అనేక మంది ప్రముఖులు మృత్యవాత పడ్డారు. దీంతో ప్రజల్లో జాగ్రత్త పెరిగి గత మూడునెలల్లో గుండె పరీక్షల కోసం ఆస్పత్రులకు వచ్చేవారి సంఖ్య  అత్యధికంగా పెరిగింది. ఇందులో 56 శాతం మంది  30–39 ఏళ్లులోపు వారు  ఉన్నారు.  

మరిన్ని వార్తలు