అసోం హై అలర్ట్.. భూటాన్ చేసిన పనితో..

14 Jul, 2023 07:59 IST|Sakshi

అసోం: వరదలతో ఉత్తరాది వణికిపోతున్న వేళ.. అసోం సహా పలు రాష్ట్రాలకు కొత్తగా మరో ముప్పు పొంచి ఉంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అసోంలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ముంపును ఎదుర్కొంటున్నాయి. దాదాపు 4000 మంది వరకు ప్రజలు వరదలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బిశ్వనాథ్, బొంగైగాన్‌, ఛిరంజ్‌, ధేమాజీ, దిబ్రుగర్హ్‌, కోక్రజార్హ్‌, నల్‌బరి, టిన్‌సుకియా ప్రాంతాలు ఇప్పటికే ముంపుకు గురయ్యాయి.

అయితే.. తూర్పు భూటాన్‌లోని కురిచ్చు ప్రాజెక్టును డ్రక్‌ గ్రీన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌(డీజీపీసీ) నిర్వహిస్తోంది. కాగా.. ఈ రిజర్వాయర్ నుంచి వరద నీటిను విడుదల చేయనున్నట్లు జులై 13 అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసింది. నియంత్రిత పద్దతిలో కనీసం 9 గంటలపాటు నీటిని విడుదల చేయనున్నామని స్పష్టం చేసింది.

దీంతో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అప్రమత్తమయ్యారు. ఆయా ముంపుకు గురయ్యే పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. జాగ్రత్తగా పరిస్థితులను గమనించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కురిచ్చు రిజర్వాయర్‌ వరదతో భేకీ, మనాస్ నదులు విజృంభించే అవకాశం ఉందని చెప్పారు.  

అసోంలోని బ్రహ్మపుత్ర, భేకీ, డిసాంగ్ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున‍్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 179 జిల్లాలు, 19 రెవెన్యూ సర‍్కిళ్లు, ముంపులో ఉన్నాయి. 2211.99 హెక్టార్ల పంట నష్టం జరిగింది. ధేమాజీ, ఛిరంగ్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అసోం విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ప్రస్తుతం భూటాన్ ప్రాజెక్టు నుంచి విడుదల అయ్యే నీటితో ఇంకా ఎంత నష్టం జరగనుందో అని ప్రజలు ఆందోళనలో చెందుతున్నారు.

ఉత్తరాది అతలాకుతలం.. వరదలపై ముందస్తుగా హెచ్చరికలేవీ? షాకింగ్‌ విషయాలు

మరిన్ని వార్తలు