ఒంటి కాలితో పాఠశాలకు వెళ్తున్న చిన్నారి వీడియో వైరల్‌

25 May, 2022 21:33 IST|Sakshi

ఇంతవరకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన గాథలు విన్నాం. ప్రతికూల పరిస్థితులను దాటుకుంటూ పైకి వచ్చిన వారిని చూశాం. దివ్వాంగులు సైతం అందరివాళ్లలా అన్ని చేయగలమంటూ సాధించిన విజయాల గురించి విన్నాం. అలాంటి వారి కోవకు చెందినదే ఈ చిన్నారి కూడా. విధి మిగిల్చిన విషాదాన్ని పక్కనపెట్టి చక్కగా చదువుకునేందుకు తాపత్రయ పడుతోంది ఈ చిట్టితల్లి.

వివరాల్లోకెళ్తే....బిహార్‌లోని జాముయి జిల్లాకు చెందిన సీమా అనే బాలిక ఒంటికాలితో పాఠశాలకు వెళ్తోంది. ఆ చిన్నారికి రెండేళ్లక్రితం జరిగిన ప్రమాదంలో ఒక కాలు తీసేయాల్సి వచ్చింది. కానీ ఆ విషాదం ఆ చిన్నారి చదువుని ఆపలేకపోయింది. ఆ బాధను ఏ మాత్రం పట్టించుకోకుండా రోజు కి.మీ దూరంలో ఉ‍న్న స్కూల్‌కి ఒంటికాలితోనే వెళ్తోంది. ఈ మేరకు ఆమె ఒంటి కాలుతో స్కూల్‌కి వెళ్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. దీంతో బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ ఆ చిన్నారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆయన కరోనా సమయంలో ఎంతోమందికి సాయం చేసి అందరి ప్రశంసలను అందుకున్న సంగతి తెలిసిందే.

సోనుసూద్‌ ట్విట్టర్‌లో "ఆ చిన్నారి ఇప్పుడు రెండు పాదాలపై పాఠశాలకు వెళుతుంది. నేను టిక్కెట్‌ పంపుతున్నాను. ఆ చిన్నారి రెండు కాళ్లపై నడిచే సమయం ఆసన్నమైంది" అంటూ తన ఎన్‌జీవ్‌ సూధా ఫౌండేషన్‌ని కూడా ట్యాగ్‌ చేసి ట్వీట్‌ చేశారు. అంతేకాదు ఈ ఆ చిన్నారి వీడియో పలువురి ప్రముఖులను కదిలించింది. ఈ మేరకు బిహార్‌ ప్రభుత్వ భవన నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ అశోక్ చౌదరి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఆ చిన్నారిని ప్రశంసించారు. సీమా లాంటి పిల్లలను గుర్తించి సాయం అందించడమే కాకుండా ఆ చిన్నారికి కూడా తగిన సాయం అందుతుందని చెప్పారు.

(చదవండి: చిరకాల కాంక్ష! ఒక వ్యక్తి జంతువులా మారడం కోసం ఏకంగా రూ.12 లక్షలు పెట్టి...)

మరిన్ని వార్తలు