బీజేపీకి ఊహించని షాకిచ్చిన మిత్రపక్షం

17 Sep, 2020 08:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశంలో అధికార బీజేపీకి ఊహించని షాక్‌ ఎదురైంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వ్యవసాయ రంగాల సంస్కరణ బిల్లుకు ఎన్డీయే ప్రధాన మిత్రపక్షం శిరోమణీ అకాలిదళ్‌ వ్యతిరేకించింది. ఈ మేరకు ఆయా బిల్లులకు పార్లమెంట్‌లో వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆ పార్టీ విప్‌ జారీచేసింది. ప్రస్తుత సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బిల్లులను అడ్డుకోవాలని నిర్ణయించింది. కాగా వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసేందుకు మోదీ సర్కార్‌ మూడు ఆర్డినెన్స్‌లను ఇటీవల జారీచేసిన విషయం తెలిసిందే. నిత్యావసర సరుకులపై ఓ ఆర్డినెన్స్‌, రైతులకు సాధికారిత కల్పించడంతో పాటు గిట్టుబాటు ధరలు కల్పించే ఉద్దేశంతో మరో ఆర్డినెన్స్‌, వ్యవసాయ ఉత్పత్తులకు వాణిజ్యపరమైన ప్రోత్సాహం కల్పించే పేరుతో మరో ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టారు. (చైనా నుంచి చొరబాట్లు లేవు)

వీటికి సంబంధించిన బిల్లులను ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఆమోదం తెలపాలని కేంద్రం భావించింది. నిత్యావసరాల సవరణ బిల్లును మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. అయితే కేంద్రం ప్రతిపాదిత బిల్లులపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉ‍త్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన నిర్వహించారు. దీనిపై పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని అకాలిదళ్‌ ఎంపీలకు విప్‌ జారీచేసింది. రాజ్యసభలో బిల్లును వ్యతిరేకించాలని అకాలిదళ్‌ నిర్ణయించింది. మరోవైపు ఉత్తర భారతంలో మొదలైన రైతు మద్దతు ఉద్యమం త్వరలోనే దక్షిణాదికి కూడా విస్తరిస్తామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. కాగా పంజాబ్‌లో ఎన్నో ఏళ్లుగా బీజేపీ-అకాలిదళ్‌ భాగస్వామ్యంగా ఉన్న విషయం తెలిసిందే. (వ్యవసాయం కార్పొరేటీకరణ ?)

ప్రభుత్వం చెబుతున్నదేంటి ?
మొదటి బిల్లు రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) ప్రకారం రైతులు పండించిన పంటల్ని మార్కెట్‌ యార్డుల్లోనే విక్రయించాలన్న నిబంధనలు ఉండవు. తమ ఉత్పత్తుల్ని ఎప్పుడైనా, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మార్కెట్‌ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు ఎక్కువ ధర వచ్చినప్పుడే తమ పంటను అమ్ముకోవచ్చు. ఇక రెండో బిల్లు రైతుల ధరల హామీ, సేవల ఒప్పందం ప్రకారం పంటలు వేయడానికి ముందే వ్యాపారస్తులతో రైతులు చేసుకునే ఒప్పందాలకు చట్టబద్ధత వస్తుంది. కాంట్రాక్ట్‌ సేద్యాన్ని చట్టబద్ధం చేయడం వల్ల వ్యాపారులు ఒప్పందాలను ఉల్లంఘించడం కుదరదు. ఇక మూడో బిల్లు నిత్యావసరాల సవరణ బిల్లు ప్రకారం చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు వంటి ఆహార ఉత్పత్తుల నిల్వలపై ఆంక్షలు తొలగిపోతాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా