ఎమ్మెల్యే కుమారుల అరాచకం.. సిబ్బందిపై దాడి.. వీడియో వైరల్‌

23 Apr, 2022 18:14 IST|Sakshi

ఎమ్మెల్యే కొడుకులు వీరంగం సృష్టించారు. తమ అక్రమ వ్యాపారాలను అడ్డుకుంటున్నారనే నెపంతో అటవీశాఖ అధికారులపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఇద్దరు కుమారులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. షియోపూర్‌లోని బుధేరా ఫారెస్ట్ రేంజ్‌లో అటవీ శాఖ అధికారులపై విజయ్‌పూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సీతారాం ఆదివాసీ కుమారులు దాడి చేశారు. తమ అక్రమ వ్యాపారాలను అడ్డుకున్నందుకే వారు దాడి చేశారని అధికారులు వెల్లడించారు. కాగా, ఎమ్మెల్యే కుమారులు ధనరాజ్, దీనదయాళ్.. అక్రమ మైనింగ్‌, అడవి నుంచి ఇసుక, రాళ్ల అక్రమ రవాణా, అక్రమంగా చెట్ల నరికివేతకు పాల్పడుతున్నారని ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు వారిని అడ్డుకోవడంతో దాడి జరిగింది. 

అయితే, బుధేరా ఫారెస్ట్ రేంజ్‌లోని పిప్రాని ఫారెస్ట్ పోస్ట్‌లో తన వాహనాలను అడ్డుకున్నందుకు ధనరాజ్ అటవీ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అతని పక్కనే ఉన్న సోదరుడు దీనదయాళ్‌ సహనం కోల్పోయి వారి సహచరులతో కలిసి ఫారెస్ట్ గార్డులు రామ్‌రాజ్ సింగ్, రిషబ్ శర్మ, డ్రైవర్ హసన్ ఖాన్‌లను తిడుతూ వారిపై దాడి చేశారు. ఈ విషయం వారు అటవీశాఖ సీనియర్‌ అధికారులకు తెలపడంతో వారిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే కుమారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు షియోపూర్ పోలీస్ సబ్ డివిజనల్ ఆఫీసర్ రామ్ తిలక్ మాల్వియా తెలిపారు. 

ఇది కూడా చదవండి: లక్కీ ఫెలో.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు

మరిన్ని వార్తలు