కేజ్రీవాల్‌కు బిగ్‌ షాక్‌.. ఆప్‌ గుర్తింపు రద్దు కోరుతూ ఈసీకి బ్యూరోక్రట్ల లేఖ

16 Sep, 2022 08:18 IST|Sakshi

ఢిల్లీ: ఒకవైపు గుజరాత్‌లోనూ పాగా వేయాలని.. ఎన్నికల ముందస్తు ప్రచారంలో పాల్గొంటున్నారు ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. ఈక్రమంలో ‘ఉచిత’ హామీల మీద హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు. అయితే అధికార రాష్ట్రంలోనే కేజ్రీవాల్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. 

ఆమ్‌ ఆద్మీ పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ 57 మంది బ్యూరోక్రట్స్‌, డిప్లోమాట్స్‌.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను రాబోయే ఎన్నికల కోసం ఆప్‌ వాడుకోవాలని చూస్తోందని లేఖలో వాళ్లు ఆరోపించారు. 

ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌.. పోలీస్‌ సిబ్బంది, హోం గార్డులు, అంగన్‌వాడీ వర్కర్స్‌, ప్రజారవాణ వ్యవస్థలోని డ్రైవర్లను, ఆఖరికి పోలింగ్‌ బూత్‌ ఆఫీసర్లను కూడా వచ్చే ఎన్నికల్లో ఆప్‌ కోసం పని చేయాలని పిలుపు ఇచ్చారు. కానీ, ఇలా ప్రజా సేవకులను.. ఒక పార్టీ, అదీ అధికారంలో ఉన్న పార్టీ తమ ఎన్నికల స్వార్థం కోసం వాడుకోవడం సరైంది కాదు. ఇది ప్రజా ప్రతినిధుల చట్టం 1951 నిబంధనలను ఉల్లంఘించేలా ఉంది. అంతేకాదు.. 1968 ఎన్నికల సింబల్స్‌ ఆర్డర్‌లోని 16ఏ ఉల్లంఘిస్తుంది.  కాబట్టి, లేఖను పరిగణనలోకి తీసుకుని ఆప్‌ గుర్తింపు రద్దు చేయాలని లేఖలో బ్యూరోక్రట్లు కోరారు. 

ప్రభుత్వ ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తూ.. స్వలాభం కోసం ఆప్‌, వాళ్లను వాడుకోవాలని చూస్తోందని లేఖలో ఆరోపించారు వాళ్లు. అంతేకాదు.. ఆప్‌ కోసం పని చేస్తే ట్రాన్స్‌ఫర్లతో పాటు ఉచిత విద్యుత్‌, కొత్త స్కూల్స్‌.. ఉచిత విద్య హామీలను ఇచ్చి ప్రలోభపెట్టే యత్నం చేస్తోందని లేఖలో పేర్కొన్నారు వాళ్లు. ఈ లేఖపై ఈసీ స్పందన తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా?
 

మరిన్ని వార్తలు