పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు

17 Dec, 2023 10:20 IST|Sakshi

జైపూర్‌: పార్లమెంట్‌లో అలజడి సృష్టించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల ఫోన్లను దహనం చేసిన స్థలాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడ కాలిపోయి శిథిలావస్థలో ఉన్న సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బట్టలు కాల్చి వేసిన ప్రదేశాన్ని కూడా పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా నిందితులను తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. 

పార్లమెంట్‌లో మొత్తం ఏడుగురు నిందితులు గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. లోక్‌సభ లోపల, పార్లమెంట్ ఆవరణలో పొగ బాంబులతో నిందితులు అరాచకం సృష్టించే పనిచేశారు. ఒంటికి మండే లేపనాలు పూసుకుని ఆత్మాహుతికి పాల్పడటానికి ప్రయత్నించారు. కానీ చివరికి స్మోక్ క్యానిస్టర్లను ప్రయోగించాలని నిర్ణయానికి వచ్చారు. సాగర్‌ శర్మ, డి.మనోరంజన్, అమోల్‌ షిండే, నీలం దేవి, ప్రధాన నిందితుడు లలిత్‌ ఝాలను పోలీసు ప్రత్యేక విభాగం తాలూకు కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ విభాగం విచారిస్తోంది.  నిందితులకు ఏడు రోజుల కస్టడీ విధించిన విషయం తెలిసిందే.

అందులో భాగంగా వారు ఆశ్రయం పొందిన, కుట్ర పన్నిన ప్రాంతాలకు శుక్రవారం రాత్రి వారిని తీసుకెళ్లారు. అలాగే నిందితులకు లోక్‌సభ పాస్‌లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహా స్టేట్‌మెంట్‌ను కూడా నమోదు చేయాలని భావిస్తున్నారు.

లోక్‌సభలో కలకలం జరిగిన తీరుపై పార్లమెంటు అనుమతితో సీన్‌ రీ కన్‌స్ట్రక్ట్‌ చేసే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం. లలిత్‌కు సహకరించిన మహేశ్‌ కుమావత్, కైలాశ్‌లకు క్లీన్‌చిట్‌ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు.  లలిత్‌ను బుధవారం పార్లమెంటు ప్రాంగణం నుంచి పారిపోయి అతను రాజస్థాన్‌లో తలదాచుకున్న నగౌర్‌కు కూడా తీసుకెళ్లారు. అక్కడ తనతోపాటు సన్నిహితుల సెల్‌ ఫోన్లను ధ్వంసం చేశానని లలిత్‌ చెప్పిన ప్రదేశంలో ఆధారాలు సేకరించారు.

తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేందుకు దేశంలో అరాచకం సృష్టించాలని భావించినట్లు కీలక సూత్రధారి లలిత్ ఝా కస్టడీ విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులకు తెలిపాడు.  లలిత్ ఝా తన ఫోన్‌ను ఢిల్లీ-జైపూర్ సరిహద్దులో విసిరివేసినట్లు అంగీకరించాడు. ఈ కుట్ర ప్రణాళికను అమలు చేయడానికి ముందు ఢిల్లీలో అనేకమార్లు కలిసినట్లు లలిత్ ఝా చెప్పాడు. ఇతర నిందితుల ఫోన్‌లను ధ్వంసం చేసినట్లు వెల్లడించాడు.

ఇదీ చదవండి: రాజస్థాన్ బీజేపీ కొత్త చీఫ్‌గా కైలాష్ చౌదరి

>
మరిన్ని వార్తలు