ప్రపంచంలోనే అతిపెద్ద గోదాంల ఏర్పాటు.. కేంద్రం కీలక నిర్ణయం..

31 May, 2023 21:17 IST|Sakshi

ఆహార భద్రతను పటిష్ఠం చేయడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద గోదాంల ఏర్పాటుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల నిల్వ కోసం గోదాంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం రూ.లక్ష కోట్లను వెచ్చించనున్నట్లు పేర్కొంది. దీంతో రైతుల ధాన్యం పాడవకుండా, కొనుగోళ్లలో రైతుల ఇబ్బందుల తప్పించడానికి సులభమవుతుందని ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.  

గోదాంల ఏర్పాటుకు పలు మంత్రిత్వ శాఖల భాగస్వామ్యం కోసం ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దేశంలో ఎంపిక చేసిన పది జిల్లాలలో ప్రయోగాత్మకంగా గోదాంల ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో గోదాంల ఏర్పాటు జరగనుందని తెలిపింది. దీంతో రానున్న ఐదేళ్లలో 700 లక్షల టన్నుల ధాన్యం నిలువ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు పెంపొందుతాయని పేర్కొంది. ప్రతి మండలంలో 2 వేల టన్నుల ధాన్యం నిలువచేసుకునేలా గోదాంలను ఏర్పాట‍ు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. 

దేశంలో ప్రస్తుతం 3,100 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నట్లు ఠాకూర్ తెలిపారు. కానీ 1,450 లక్షల టన్నుల ధాన్యం నిలువ చేసుకునే వెసులుబాటు మాత్రమే ప్రస్తుతం  ఉన్నట్లు  వెల్లడించారు. ప్రస్తుతం గోదాంల ఏర్పాటుతో ధాన్యం నిలువచేసుకునే సామర్థ్యం 2,150 లక్షల టన్నులకు చేరుతుందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని మించి ధాన్యం నిలువ చేసుకునే సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. 

ఇదీ చదవండి:Wrestlers Protest: విచారణ ముగిసే వరకు వేచి ఉండండి!

మరిన్ని వార్తలు