ఆయన ధైర్యమే కాపాడింది!

8 Aug, 2020 08:28 IST|Sakshi
దీపక్‌ వసంత్‌ సాథే (ఫైల్ ఫోటో)

బోయింగ్ 737 విమానాలు నడపడంలో అపార అనుభవం సాథే సొంతం

ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ నుంచి  ‘స్వోర్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ 

తిరువనంతపురం: కేరళ కోళీకోడ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో అసువులు బాసిన  పైలట్  దీపక్‌ వసంత్‌ సాథే (59) అసమాన ప్రతిభ గురించి అనేక కీలక విషయాలను సీనియర్ అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. 22 ఏళ్ల అపార అనుభవం, విమానాలు నడపడంలో నిష్ణాతుడైన వసంత్ సాథే వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగానే విమానాన్ని నియంత్రించలేక పోయారనీ, విమానం రెండు ముక్కలైన తీరు ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోందని  పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  (విమాన ప్రమాదంపై లోతుగా దర్యాప్తు)

వింగ్ కమాండర్ దీపక్ వసంత సాథే గతంలో భారత వాయుసేనలో యుద్ధవిమానం (మిగ్‌21) పైలట్‌గా పనిచేశారు. ఖరాక్ వస్లాలోని ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 58వ బ్యాచ్‌కు చెందిన సాథే అనేక మంది పైలెట్లకు శిక్షణ ఇచ్చారు.  బోయింగ్ 737 విమానాలు నడపడంలో పైలెట్ సాథేది అందె వేసిన చెయ్యి. అంతేకాదు జూన్, 1981లో హైదరాబాద్ లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ నుంచి ‘స్వోర్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’  అందుకున్నారు. 2003లో వాయుసేన నుంచి రిటైరైన అనంతరం 2005లోఎయిరిండియాలో చేరారు. అంకితభావం, అపారమైన నైపుణ్యం సాథే సొంతమని రాష్ట్రపతి గోల్డ్‌ మెడల్‌ కూడా సాధించారంటూ అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. (రెండు ముక్కలైన విమానం)

మరోవైపు ఆయన అప్రమత్తత వల్లనే ప్రాణాలతో బయటపడ్డామని, ఈ ప్రమాదంలో గాయపడిన వారు వ్యాఖ్యానించారు. ఆయన అనుభవం, ధైర్యంతోనే ప్రమాదం జరిగిన తరువాత మంటలను నివారించగలిగా రంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. భారీ వర్షం కారణంగా వాతావరణం అస్సలు బాలేదని ల్యాండింగ్ ముందే హెచ్చరించారు. రెండుసార్లు సురక్షితమైన ల్యాండింగ్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారని ఇబ్రహీం అనే ప్రయాణికుడు తెలిపారు. కానీ ఆయన తెగువతో తాము అద్భుతంగా తప్పించుకుని స్వల్ప గాయాలతో సురక్షితంగా ఉన్నామని చెప్పారు. 

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దుబాయ్ నుంచి స్వదేశానికి తరలిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ విమానానికి జరిగిన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు వింగ్ కమాండర్ దీపక్‌ వసంత్‌ సాథే, కెప్టెన్ అఖిలేష్ కుమార్ సహా 18 మంది  మరణించిన సంగతి తెలిసిందే..

మరిన్ని వార్తలు