లౌడ్‌స్పీక‌ర్ల వివాదంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. రాజ్ ఠాక్రేపై కేసు న‌మోదు

3 May, 2022 18:08 IST|Sakshi

ముంబై: ఔరంగాబాద్‌లో ఆదివారం ఎమ్మెన్నెస్‌ చీఫ్‌ రాజ్‌ఠాక్రే నిర్వహించిన బహిరంగ సభలో పోలీసులు విధించిన షరతుల్లో కొన్ని ఉల్లంఘించారనే అభియోగంపై మంగళవారం చీఫ్‌ రాజ్‌ ఠాక్రేపై కేసు నమోదైంది. రాజ్‌ ప్రసంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఔరంగాబాద్‌ పోలీసులు నియమాల ఉల్లంఘన జరిగినట్లు నివేదిక రూపొందించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి, హోంమంత్రి, సంబంధత అధికారులతో జరిగిన సమావేశంలో ఆ నివేదికను ప్రవేశపెట్టారు. ఈ నివేదికపై ఆరా తీసిన తరువాత ఔరంగాబాద్‌లోని సిటీ చౌక్‌ పోలీసు స్టేషన్‌లో రాజ్‌పై కేసు నమోదు చేశారు.

సభకు అనుమతిచ్చే ముందు పోలీసులు విధించిన మొత్తం 16 షరతుల్లో 12 షరతుల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో రాజ్‌తోపాటు సభకు అనుమతివ్వాలని దరఖాస్తు చేసుకున్న రాజీవ్‌ జవళేకర్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఔరంగాబాద్‌లో కేసు నమోదైన విషయంపై రాజ్‌ ఠాక్రే తనయుడు అమిత్‌ ఠాక్రే ఫోన్‌చేసి స్ధానిక ఎమ్మెన్నెస్‌ పదాధికారి రజీవ్‌ జవళేకర్‌తో చర్చించారు. చట్టం అందరి సమానంగా ఉండాలని, పోలీసులు సభకు అనుమతిచ్చే ముందు కేవలం 15 వేల మంది హాజరుకావాలని షరతులు విధించారని, అయితే రాజ్‌ ఠాక్రే రోడ్డుపై నడుస్తూ వెళుతుంటేనే 15 వేలకుపైగా జనాలు అనుసరిస్తారని, ఇలాంటి సందర్భంలో షరతులు ఉల్లంఘించారని కేసు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

మరోనేత సందీప్‌ దేశ్‌పాండే మాట్లాడుతూ తొలుత సభకు అనుమతివ్వకపోవడం, ఆ తరువాత సమయం దగ్గరపడగానే షరతులతో కూడిన అనుమతివ్వడం లాంటి సందర్భాలు గతంలో ఎదురు కాలేదన్నారు. పోలీసులపై ప్రభుత్వం కచ్చితంగా ఒత్తిడి తెచ్చిందని దీన్ని బట్టి స్పష్టమవుతోందన్నారు. కార్యకర్తలను భయపట్టేందుకే కేసులు నమోదు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేసు నమోదు చేసిన నిందితుల జాబితాలో రాజ్‌ ఠాక్రే పేరు మొదటి స్ధానంలో ఉంది. ఆ తరువాత రాజీవ్‌ జావళేకర్, నిర్వాహకులు, ఇతర పదాధికారుల పేర్లున్నాయి. స్ధానిక సిటీ చౌక్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ గిరీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: డెన్మార్క్ ప్ర‌ధాని నివాసంలో మోదీ చర్చలు.. వీడియో వైరల్‌

నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌
మరోవైపు  మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరేపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. 14 ఏళ్ల కిందటి కేసులో మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా రాజ్‌ ఠాక్రే రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై 2008లో ఆయనపై ఐపీసీ సెక్షన్‌ 109,117 కింది కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణలో రాజ్‌ ఠాక్రే కోర్టుకు హాజరు కాకపోవడంతో జూన్‌ 8లోపు అతన్ని అరెస్టు చేసి కోర్టులో  హాజరుపరచాలని  సాంగ్లి జిల్లా షిరాలా ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ పేర్కొంది. అయితే 2012 కంటే ముందు నమోదైన రాజకీయ పరమైన కేసులన్నిటినీ ప్రభుత్వం రద్దు చేసిందని ఎంఎన్‌ఎస్‌ నేత ఒకరు గుర్తు చేశారు.   

మరిన్ని వార్తలు