Centre to Supreme Court: స్వలింగ సమస్యలపై కమిటీ

4 May, 2023 06:15 IST|Sakshi

సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదన

అభిప్రాయాల ఆధారంగా పోలేం

నిబంధనలను బట్టే వెళ్తాం: సీజేఐ

న్యూఢిల్లీ: స్వలింగ జంటల సమస్యల పరిష్కారానికి కేబినెట్‌ సెక్రెటరీ సారథ్యంలో కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సారథ్యంలోని ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. స్వలింగ జంటలకు జాయింట్‌ బ్యాంకు ఖాతాలు, పీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్‌ పథకాల్లో స్వలింగ భాగస్వామిని నామినీగా చేర్చడం వంటివాటిపై నెలకొన్న సమస్యలను ఏప్రిల్‌ 27 నాటి విచారణ సందర్భంగా ధర్మాసనం లేవనెత్తింది.

వీటి పరిష్కారానికి ఏం చేయొచ్చో ఆలోచించాలని సూచించింది. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు. కోర్టు అంగీకరిస్తే కమిటీ వేసి అన్ని అంశాలనూ కూలంకషంగా పరిశీలిస్తామని వివరించారు. పిటిషనర్ల సలహాలు, సూచనలను కూడా కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. అందుకు తమకభ్యంతరం లేదని పిటిషనర్ల తరఫున సీనియర్‌ లాయర్‌ ఎ.ఎం.సింఘ్వి అన్నారు. అయితే దీనివల్ల పరిష్కారం లభించదన్నారు.

ధర్మాసనమే దీనిపై సమగ్రమైన తీర్పు వెలువరించాలని కోరారు. కేంద్రం సూచనను ఓ చక్కని ముందడుగుగా న్యాయమూర్తి జస్టిస్‌ భట్‌ అభివర్ణించారు. స్వలింగ జంటలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు కమిటీతో పరిష్కారం లభించగలదని అభిప్రాయపడ్డారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత అంశాన్ని సమగ్రంగా పరిశీలించి తీర్పు వెలువరిస్తామని సీజేఐ పేర్కొన్నారు.

సహజీవనం చేస్తున్న స్వలింగ జంటల్లో 99 శాతం మంది పెళ్లి చేసుకోవాలనే కోరుకుంటున్నట్టు పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు సౌరభ్‌ కృపాల్, మేనకా గురుస్వామి తదితరులు చెప్పగా సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘అవతలి వర్గం కూడా తమ వాదనకు మద్దతుగా బోలెడన్ని గణాంకాలు చూపిస్తారు. అందుకే మేం ఇలాంటి మెజారిటీ నైతికతనో మరోదాన్నో ప్రాతిపదికగా తీసుకుని విచారణ జరపలేం. రాజ్యాంగ నియమ నిబంధనలను బట్టే ముందుకెళ్తాం’’ అని స్పష్టం చేశారు. తదుపరి వాదనలు మే 9న కొనసాగనున్నాయి.  

ఈడీ డైరెక్టర్‌గా ఇంకెవరూ పనికిరారా?
ఈడీ డైరెక్టర్‌గా వరుసగా మూడోసారి  సంజయ్‌ కుమార్‌ మిశ్రాకు పదవీ కాలం పెంచడంపై సుప్రీం కోర్టు మండిపడింది. డెరైక్టర్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పదవిని చేపట్టడానికి మిశ్రా తప్ప సంస్థలో మరెవరూ లేరా అని ప్రశ్నించింది. మూడోసారి కూడా ఆయనకే పదవీ కాలం పొడిగించాల్సిన ఆవశ్యకత ఏముందని ప్రశ్నించింది. మిశ్రా పదవీకాలాన్ని పొడిగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న వారికి పదవీకాలం ఎక్కువగా పొడగించకూడదని సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేసింది.

‘‘ఈడీ డైరెక్టర్‌గా మిశ్రాకు మించిన వారు మరెవరూ లేరని మీరు భావిస్తున్నట్టున్నారు. ఆయన రిటైరయ్యాక ఎవరిని నియమిస్తారు?’’ అని జస్టిస్‌ బిఆర్‌ గవాయ్, జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ల బెంచ్‌ నిలదీసింది. కీలక కేసుల్ని విచారిస్తున్నప్పుడు ఒకరి ఆధ్వర్యంలో అయితే విచారణ సరిగా సాగుతుందని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు