Chandrayaan-3: జాబిల్లిపై భారత్‌ నడక

25 Aug, 2023 05:29 IST|Sakshi
ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌

చంద్రయాన్‌–3 సక్సెస్‌పై ఇస్రో హర్షాతిరేకాలు 

రోవర్‌ ప్రజ్ఞాన్‌ నడక ప్రారంభించిందంటూ పోస్టు  

బెంగళూరు/న్యూఢిల్లీ:  చంద్రయాన్‌–3 మిషన్‌ విజయవంతం కావడం పట్ల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. ల్యాండర్‌ విక్రమ్‌ నుంచి రోవర్‌ ప్రజ్ఞాన్‌ బయటకు వచి్చ, తన కార్యాచరణ ప్రారంభించింది. చందమామ ఉపరితలంపై పరిశోధనలు చేస్తూ భూమిపైకి విలువైన సమాచారాన్ని చేరవేస్తోంది. రోవర్‌ ప్రజ్ఞాన్‌ చంద్రుడిపై నిరి్వఘ్నంగా అడుగుపెట్టడాన్ని ప్రస్తావిస్తూ ‘చందమామపై భారత్‌ నడుస్తోంది’’ అని ఇస్రో పేర్కొంది.

ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. చంద్రుడి కోసం భారత్‌లో తయారు చేసిన ఈ రోవర్‌ ల్యాండర్‌ నుంచి బయటకు అడుగుపెట్టి, చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా నడక ప్రారంభించిందని వెల్లడించింది. ప్రజ్ఞాన్‌ రోవర్‌ ప్రయాణం పట్ల ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రుడి గురించి మన పరిజ్ఞానం మరింత పెరగడానికి ప్రజ్ఞాన్‌ దోహదపడుతుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు.  

ల్యాండర్, రోవర్‌ జీవిత కాలం పెరుగుతుందా?
చంద్రయాన్‌–3 ప్రయోగంలో భాగంగా ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై అడుగుపెట్టింది. అందులో నుంచి రోవర్‌ బయటకు వచి్చంది. వాస్తవానికి రోవర్‌ జీవితకాలం ఒక లూనార్‌ డే. అంటే 14 రోజులు. 14 రోజులపాటు రోవర్‌ ప్రజ్ఞాన్‌ ల్యాండింగ్‌ సైట్‌ నుంచి అటూఇటూ సంచరిస్తూ పరిశోధనలు చేయనుంది. అయితే, రోవర్‌ జీవితకాలం 14 రోజులు మాత్రమే కాదని, మరింత పెరిగే అవకాశం ఉందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. దక్షిణ ధ్రువంపై 14 రోజులు చీకటి, 14 రోజులు వెలుగు ఉంటుంది.

సూర్యోదయం అయినప్పుడు సూర్యుడి నుంచి రోవర్‌ సౌరశక్తిని గ్రహించి, దాన్ని విద్యుత్‌గా మార్చుకొని  పరిశోధనలు కొనసాగించేందుకు ఆస్కారం ఉందంటున్నారు. ల్యాండర్, రోవర్‌ల మొత్తం బరువు 1,752 కిలోలు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై 14 రోజులపాటు పనిచేసేలా వీటిని రూపొందించారు. లూనార్‌ డే ముగిసిన తర్వాత కూడా వాటిలో జీవం నిండే అవకాశాలు లేకపోలేదని పేర్కొంటున్నారు. సూర్యకాంతి ఉన్నంతవరకు ల్యాండర్, రోవర్‌ చక్కగా పనిచేస్తాయి. చీకటి పడగానే ఉష్ణోగ్రత మైనస్‌ 180 డిగ్రీలకు పడిపోతుంది. అవి పనిచేయడం ఆగిపోతుంది.  

గూగుల్‌ డూడుల్‌గా చంద్రయాన్‌–3  
చంద్రయాన్‌–3 మిషన్‌ విజయం పట్ల సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ తన సంతోషాన్ని నెటిజన్లతో పంచుకుంది. గురువారం గూగుల్‌ డూడుల్‌గా చంద్రయాన్‌–3కు సంబంధించిన ప్రత్యేక యానిమేటెడ్‌ చిత్రం ప్రత్యక్షమయ్యింది. ఇందులో గూగుల్‌ అనే ఇంగ్లిష్‌ అక్షరాలు అంతరిక్షంలో నక్షత్రల్లాగా తేలుతూ కనిపించాయి. రెండో అక్షరం చంద్రుడిలా దర్శనమిచి్చంది.  

26న ఇస్రో ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ  
చంద్రయాన్‌–3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో సైంటిస్టులను స్వయంగా కలిసి అభినందించడానికి ప్రధాని మోదీ ఈ నెల 26న బెంగళూరుకు రానున్నారు. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో సైంటిస్టులతో సమావేశమవుతారు.

మనిషి మనుగడకు అవకాశం
శివాజీనగర: చంద్రుని దక్షిణ ధ్రువం భవిష్యత్‌లో మానవాళి మనుగడకు వీలుగా ఉంటుందని విశ్వసిస్తున్నట్లు ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ చెప్పారు. అందుకే చంద్రయాన్‌–3 ల్యాండర్‌ దిగటానికి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నామని తెలిపారు. ‘మనం దాదాపు 70 డిగ్రీల దక్షిణ ధ్రువానికి దగ్గరగా వెళ్లాం, అక్కడ సూర్యరశ్మి తక్కువగా ఉండటానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం ఉంది.

రోవర్‌ ద్వారా ఆ ప్రాంతం గురించి శాస్త్రీయంగా మరింత సమాచారం లభించే అవకాశముంది. చంద్రునిపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు దక్షిణ ధ్రువంపై చాలా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే మానవులు వెళ్లి అక్కడ నివాసాలను సృష్టించి ఆపై దాటి ప్రయాణించాలని అనుకుంటున్నారు. కాబట్టి మనం వెతుకుతున్నది ఉత్తమమైన ప్రదేశం. దక్షిణ ధ్రువం అలా ఉండేందుకు అవకాశముంది’అని ఆయన చెప్పారు.  గురువారం ఆయన బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు.

ఇస్రో శాస్త్రవేత్తల నాలుగేళ్ల శ్రమకు తగ్గ ఫలితం లభించిందని అన్నారు. చంద్రునిపై విజయవంతంగా దిగిన విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి ప్రజ్ఞాన్‌ రోవర్‌ సాఫీగా బయటకు వచి్చందని తెలిపారు. ‘నిర్దేశిత ప్రయోజనం కోసం దక్షిణ ధ్రువంపైన గుర్తించిన 4.5 కి.మీ. గీ 2.5 కి.మీ. ప్రాంతానికి సరిగ్గా 300 మీటర్ల దూరంలోపు దూరంలోనే ల్యాండర్‌ దిగింది. రోవర్‌లోని రెండు పరికరాలు, ల్యాండర్‌లోని మూడు పరికరాలు నిర్దేశించిన విధంగా పనిచేస్తున్నాయి’అని పేర్కొన్నారు. రోవర్‌ బయట తిరుగాడుతూ పరిశోధనల ప్రారంభించిందని చెప్పారు. రోవర్‌లో అమర్చిన రెండు పరికరాలు చంద్రుని మట్టిలో మూలకాలు, రసాయనాలను పరిశీలిస్తాయని చెప్పారు. రోబోటిక్‌ పాత్‌ ప్లానింగ్‌ కూడా చేయిస్తాయని తెలిపారు. 

మరిన్ని వార్తలు