‘ఇంటి ముందు మూత్రవిసర్జన.. వాడేసిన మాస్కులు’

25 Jul, 2020 16:55 IST|Sakshi

చెన్నై: పార్కింగ్‌ స్థలం వివాదంలో ఏబీవీపీ జాతీయాధ్యక్షుడు డాక్టర్‌ సుబ్బయ్య షణ్ముగం తనను వేధిస్తున్నారంటూ 62 ఏళ్ల మహిళ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుబ్బయ్య తన ఇంటి ముందు మూత్ర విసర్జన చేస్తున్నారని.. వాడిన మాస్కులను, వేపాకులను తన ఇంటి ముందు పడేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, సీసీటీవీ వీడియోలను పోలీసులకు అందించారు. మహిళ బంధువు, అప్‌కమింగ్‌ కమెడియన్‌ బాలాజీ విజయరాఘవన్‌.. దీని గురించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. వివాదం గురించి మాట్లాడుతూ.. ‘షణ్ముగం మా ఆంటీ పర్మిషన్‌తో పార్కింగ్‌ స్థలాన్ని వినియోగించుకుంటున్నారు. ఇందుకు గాను 1500 రూపాయల అద్దె‌ చెల్లించాల్సిందిగా మా ఆంటి షణ్ముగాన్ని కోరింది’ అని తెలిపాడు. (72 ఏళ్ల విద్యార్థి ఉద్యమం)

బాలాజీ మాట్లాడుతూ.. ‘దాంతో షణ్ముగం మా ఆంటీ ఇంటి ముందు మూత్ర విసర్జన చేయడం.. వాడేసిన మాస్క్‌లను ఇంటి ముందు పడేయడం చేస్తున్నాడు. అతడి చర్యలతో విసిగిపోయిన మా ఆంటీ దీని గురించి అడంబక్కం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది’ అని తెలిపారు. షణ్ముగం, ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడిగానే కాక కిల్పాక్ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ రాయపేట ఆసుపత్రిలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సర్జికల్ ఆంకాలజీ హెడ్‌గా పని చేస్తున్నారు. (ప్రయాణికుల్లా వచ్చి...)

ఈ అంశంపై డీఎంకే నాయకురాలు కనిమొళి ట్విటర్‌లో స్పందించారు. ‘మితవాద నాయకుల మీద ఫిర్యాదులు వస్తే.. పోలీసులు గుడ్డివాళ్లలాగా ప్రవర్తించడం రివాజుగా మారింది. సీఎంఓ తమిళనాడు తక్షణమే దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించాలి’ అని డిమాండ్‌ చేశారు. అయితే ఈ వీడియో, ఫిర్యాదు అన్ని ఫేక్‌ అంటుంది ఏబీవీపీ. జాతీయ అధ్యక్షుడి పరువు తీయడానికే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డది. ఫిర్యాదు చేసిన మహిళ వెనక ఎన్‌ఎస్‌యూఐ ఉందని ఆరోపించింది.   

మరిన్ని వార్తలు