న్యాయ వృత్తిలో మహిళలు పెరగాలి: సీజేఐ

26 Mar, 2023 04:28 IST|Sakshi

ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య అభిప్రాయ భేదాలే: రిజిజు

మదురై: న్యాయ వృత్తిని చేపడుతున్న పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉందంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ మరోసారి తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ‘‘నైపుణ్యమున్న మహిళా లాయర్లకు మన దేశం కొదవేమీ లేదు. అయినా పురుషులతో పోలిస్తే వారి సంఖ్య ఎప్పుడూ చాలా తక్కువే. మహిళలు ఇంటిపని తదితరాల కారణంగా వృత్తికి న్యాయం చేయలేరేమోనని లా చాంబర్లు భావిస్తుండటం వంటివి ఇందుకు కారణాలు’’ అన్నారు.

‘‘పిల్లల్ని కనడం, వారి సంరక్షణ తదితరాల వల్ల మహిళలకు వృత్తిపరంగా శిక్ష పడకూడదు. రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకోవడానికి వారికి వ్యక్తిగతంగానే గాక వ్యవస్థాగతంగా కూడా చేయూతనివ్వాలి. కోర్టు సముదాయాల్లో క్రెష్‌ సదుపాయం దిశగా సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు తీసుకున్న చర్యల వంటివి దేశవ్యాప్తం కావాలి’’ అని అభిప్రాయపడ్డారు. శనివారం మదురైలో జిల్లా కోర్టుల సముదాయం తదితరాలకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయ వృత్తి మహిళలకు సమానావకాశాలు కల్పించడం లేదన్నారు. తమిళనాడులో న్యాయవాదులుగా నమోదు చేసుకుంటున్న పురుషుల సంఖ్య 50 వేల దాకా ఉంటే మహిళలు ఐదు వేలకు మించడం లేదంటూ ఉదాహరించారు. ‘‘ఇటీవల పరిస్థితి మారుతుండటం శుభసూచకం. జిల్లా స్థాయి న్యాయ నియామకాల్లో 50 శాతానికి పైగా మహిళలే చోటుచేసుకున్నారు. ఈ ధోరణి మరింత పెరగాలి’’ అని సీజేఐ ఆకాంక్షించారు. జూనియర్‌ లాయర్లకు నెలకు కేవలం రూ.5,000–12,000 వేతనం సరికాదన్నారు.

ఘర్షణ లేదు: రిజిజు
ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య ఉన్నది అభిప్రాయ భేదాలేనని తప్ప ఘర్షణ కాదని కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్‌ రిజిజు చెప్పారు. ‘‘మా మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు గొడవలేమీ కాదు. అవి సంక్షోభం కాదు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సూచిక. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించేందుకు కేంద్రం ఎప్పుడూ సహకరిస్తుంది’’ అని చెప్పారు. చెన్నై, ముంబై, కోల్‌కతా నగరాల్లో సుప్రీంకోర్టు బెంచిలు ఏర్పాటు చేయాలని తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్‌ సీజేఐని కోరారు.

మరిన్ని వార్తలు