శ్వేతపత్రం అబద్ధాల పుట్ట

25 Dec, 2023 06:13 IST|Sakshi
బీఆర్‌ఎస్‌ హయాంలో అభివృద్ధిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తున్న కేటీఆర్‌

కాంగ్రెస్‌ సర్కారుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైర్‌

తమ పాలనలో సాధించిన విజయాలతో ‘స్వేద పత్రం’విడుదల 

శ్వేతపత్రం తప్పుల తడక.. అంకెల గారడీ 

అప్పుల పేరిట అభాండాలు వేసే ప్రయత్నం 

తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,17,015 కోట్లే 

ప్రభుత్వ గ్యారంటీ ఉన్న, లేని రుణాలనూ కలిపేసి రూ.6,71,757 కోట్లుగా చూపారు 

మా పాలనలో తెలంగాణకు రూ.50లక్షల కోట్ల ఆస్తులు సాధించిపెట్టాం

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పుల పేరుతో బీఆర్‌ఎస్‌ పాలనపై అభాండాలు వేసిందని.. శ్వేతపత్రం పేరిట అంకెల గారడీ చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. శ్వేతపత్రం అంతా తప్పుల తడక అని, అబద్ధాల పుట్ట అని విమర్శించారు. తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణకు రూ.50 లక్షల కోట్ల ఆస్తులు సాధించి పెట్టిందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, రాష్ట్రాన్ని పలు అంశాల్లో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపిందని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో తగ్గిన పేదరికాన్ని చూపించకుండా, అప్పులను రెండింతలు పెంచి చూపిస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని కాంగ్రెస్‌ సర్కారుపై మండిపడ్డారు. ఇటీవల శాసనసభలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలను ఖండిస్తూ.. బీఆర్‌ఎస్‌ రూపొందించిన ‘స్వేద పత్రం’ను ఆదివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ విడుదల చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎత్తిచూపేందుకు, వాస్తవాలను ప్రజల ముందు పెట్టేందుకే ‘స్వేద పత్రం’ను విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. 

‘‘అధికార కాంగ్రెస్‌ శ్వేతపత్రంలో చెప్పిన ప్రకారం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి లోబడి మా ప్రభుత్వ హయంలోని అప్పులు రూ.3,89,673 కోట్లే. అంతకుముందే ఉన్న అప్పులు రూ.72,658 కోట్లుపోగా.. మా ప్రభుత్వం తెచ్చిన అప్పులు రూ.3,17,015 కోట్లే. కానీ వాళ్లు దీనిని రూ.6,71,757 కోట్లుగా చూపారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన ‘స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్పీవీ)ల’అప్పులు రూ.1,27,208 కోట్లుకాగా, ఎస్పీవీల సొంత రుణాలు రూ.1,18,557 కోట్లు. ప్రభుత్వ హామీ లేని రుణాలు మరో రూ.59,414 కోట్లు. ఈ రూ.3,05,179 కోట్లు సొంత పరపతితో ఆయా సంస్థలు తెచ్చుకున్నవే. అవి ప్రభుత్వ అప్పులు కావు. కానీ మేం తెచ్చిన రూ.3.17 లక్షల కోట్ల అప్పులకు వీటిని కూడా కలిపేసి.. మొత్తం రూ.6,71,757 కోట్ల అప్పుగా చూపారు. 

పేదరికం బాగా తగ్గింది 
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ డాటా ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో పేదరికం 21.92 శాతం. అది 2023 నాటికి 5.8 శాతానికి తగ్గిపోయింది. దేశంలోని ఇంత వేగంగా పేదరికం తగ్గిన రాష్ట్రం మరొకటి లేదు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసింది. కానీ కేంద్రం ఇవ్వలేదు.  

పౌరసరఫరాల సంస్థకు రూ.56వేల కోట్ల అప్పు అవాస్తవం 
ప్రభుత్వం శ్వేతపత్రంలో చూపిన లెక్కలు తప్పుల తడక అనడానికి పౌరసరఫరాల సంస్థ అప్పులే ఉదాహరణ. ప్రస్తుతం ఆ సంస్థ ఆ«దీనంలో ఉన్న ధాన్యాన్ని అమ్మితే రూ.30 వేల కోట్లు వస్తాయి. ఇప్పటికే అమ్మిన ధాన్యానికి ఎఫ్‌సీఐ నుంచి రావాల్సిన మొత్తం రూ.16 వేల కోట్లు. వీటిని లెక్కలోకి తీసుకోకుండా పౌరసరఫరాల సంస్థ అప్పులు రూ.56 వేల కోట్లు అని ప్రభుత్వం చెప్పింది. పౌర సరఫరాల సంస్థ వెబ్‌సైట్‌లోని తాజా లెక్క ప్రకారం ఆ సంస్థ అప్పులు రూ.24,600 కోట్లు మాత్రమే. అలాగే ఆర్టీసీకి వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఆర్టీసీ తన ఆస్తులను తనఖా పెట్టుకొని అప్పు తెచ్చుకుంటే దాన్ని కూడా ప్రభుత్వ అప్పుగా చూపించారు. 

రూ.4.98 లక్షల కోట్లు వెచ్చిస్తే ఉద్యమం ఎందుకొచ్చింది? 
ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో తెలంగాణ కోసం రూ.4.98 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు శ్వేతపత్రంలో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఖర్చును జనాభా ఆధారంగా తెలంగాణ వాటా కింద చూపి తప్పుడు లెక్కలు వేశారు. నిజంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోసం అంత ఖర్చు చేస్తే.. 1969లో, 2001లో తొలి, మలి తెలంగాణ ఉద్యమాలు ఎందుకు వచ్చాయి? ఏ ప్రాంతంలో వచ్చిన ఆదాయాన్ని అక్కడే ఖర్చు చేయాలనే 1956 ఒప్పందానికి భిన్నంగా నాటి పాలకులు తెలంగాణలో వచ్చిన ఆదాయాన్ని ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేశారు. అందుకే ప్రజలు తిరగబడ్డారు.

తెలంగాణవాదుల ఆరోపణల్లో నిజానిజాలు తేల్చడానికి నాటి కేంద్ర ప్రభుత్వం పలు కమిటీలు వేసింది. ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ లలిత్‌కుమార్‌ కమిటీ, జస్టిస్‌ వశిష్ట భార్గవ కమిటీ రెండూ కూడా తెలంగాణ ఆదాయాన్ని ఆంధ్రాలో వినియోగించారన్న సంగతి నిజమేనని తేల్చాయి. కాబట్టి తెలంగాణలో రూ.4.98 లక్షల కోట్లు ఖర్చు చేశామని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్తుండటం శుద్ధ అబద్ధం. వాళ్ల లెక్కలే చూసినా.. గత తొమ్మిదిన్నరేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.13,72,930 కోట్లు. అంటే వాళ్లు 60 ఏళ్లలో చేసిన ఖర్చుకు దాదాపు మూడింతల మేర బీఆర్‌ఎస్‌ సర్కారు పదేళ్లలోనే ఖర్చు చేసింది..’’అని కేటీఆర్‌ వెల్లడించారు. 
 
అస్తిత్వమే కాదు.. ఆస్తులు సృష్టించాం 
తెలంగాణ సిద్ధించిన తర్వాత నాటి పరిస్థితులన్నీ బేరీజు వేసుకొని ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, ప్రణాళికాబద్ధంగా పాలన సాగించాం. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి మేరకు అప్పులు తెచ్చి అన్ని రంగాలను అభివృద్ధి చేయడంతోపాటు వేల కోట్ల ఆస్తులు సృష్టించాం. 

► విద్యుత్‌ రంగంలో పెట్టిన ఖర్చు రూ.1.37 లక్షల కోట్లు అయితే.. సృష్టించిన ఆస్తుల విలువ రూ.6.87 లక్షల కోట్లు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యేదాకా ఆమె సొంత గ్రామంలో విద్యుత్‌ లేదు. కానీ తెలంగాణలో కరెంటు లేని పల్లె, గూడెం లేవు. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రం 26 వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ సామర్థ్యానికి చేరుకుంటుంది. 

► సాగునీటి రంగంలో రూ.1.76 లక్షల కోట్లు ఖర్చు చేశాం. పెండింగ్‌ ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులు చేశాం. 204 టీఎంసీల రిజర్వాయర్లు నిర్మించాం. కొత్తగా 50 లక్షల ఎకరాలకు సాగునీటితో ఆయకట్టును స్థిరీకరించాం. భూగర్భజలాలు పెరగడం వల్లే పదేళ్లలో బోర్లు కూడా పెరిగాయి. 

► కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం. ఒక దగ్గర బ్యారేజీ కుంగితే మొత్తం ప్రాజెక్టునే బద్నాం చేసే ప్రయత్నం చేయొద్దు. పాలమూరు పథకానికి రూ.26,738 కోట్లు వెచ్చించాం. 

► తాగునీటిని అందించేందుకు మిషన్‌ భగీరథకు రూ.37 వేల కోట్లు ఖర్చు చేశాం. వ్యవసాయ రంగంలో 24 గంటల ఉచిత విద్యుత్‌ కోసం రూ.36,899 కోట్లు, రుణమాఫీ కోసం రూ.30 వేల కోట్లు, రైతుబంధుకు రూ.75 వేల కోట్లు, రైతుబీమా ప్రీమియం కోసం రూ.6,861 కోట్లు వెచ్చించాం. 

► సంక్షేమానికి రూ.2.86 లక్షల కోట్లు, పట్టణ ప్రగతికి రూ.1.21 లక్షల కోట్లు, పల్లెప్రగతికి రూ.70వేల కోట్లు, వైద్యరంగానికి రూ.61,650 కోట్లు, ఆధ్యాతి్మక రంగానికి రూ.2,800 కోట్లు ఖర్చు చేశాం. 
– గత తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో చేసిన అభివృద్ధితో రూ.50 లక్షల కోట్లపైనే సంపద సృష్టించాం. 
 
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాం 
ఇవాళ కొందరు నిర్బంధం, నియంతృత్వం అని మాట్లాడుతున్నారు. కానీ ఉద్యమ సమయంలోనే నిర్బంధం ఎదుర్కొన్నాం. నియంత పాలన అంటే సమైక్య పాలకులది. తెలంగాణ ఇస్తే అంధకారమే అని కట్టెలు పట్టుకొని కట్టుకథలు చెప్పినవారు, పెద్దపెద్ద మాటలు మాట్లాడినవారు, వారికి తొత్తులుగా పనిచేసినవారు ఇవాళ శ్వేతపత్రాల పేరుతో తెలంగాణను విఫల ప్రయోగంగా, విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పోరాడి తెచ్చిన తెలంగాణకు ఎవరి చేతుల్లో న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారో ఆ కేసీఆర్‌ చేతుల్లోనే పెట్టారు. కేసీఆర్‌ సీఎంగా బాధ్యలు చేపట్టిననాడు ఎన్నో రకాల ఆర్థిక చిక్కులు, రాజకీయ కుట్రలు ఉన్నాయి.

తెలంగాణ ఏర్పాటు ఒక విఫల ప్రయోగం, ఇదో విఫల రాష్ట్రమని నిరూపించే కుట్రలు జరిగాయి. విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలు ముసురుకుని ఉన్నాయి. కొందరు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు జరిగాయి. కానీ అన్నింటినీ తట్టుకుని తెలంగాణ పునరి్నర్మాణ యజ్ఞం జరిగింది. పటిష్ట ఆర్థిక క్రమశిక్షణతో ప్రణాళికలు రూపొందించుకొన్నాం. బిహార్‌లో ఉండే తెలంగాణ బిడ్డ జీఆర్‌ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా, కోలిండియా సీఎండీగా ఉన్న నర్సింగరావును సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా పెట్టుకొన్నాం. క్రమశిక్షణతో పరిపాలన సంస్కరణలకు పెద్దపీట వేస్తూ ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లాం. రాష్ట్ర తలసరి ఆదాయంలో, జీఎస్‌డీపీలో అనూహ్య ప్రగతి సాధించాం. అప్పులు కాదు.. వెలకట్టలేని ఆస్తులు సాధించాం.   

>
మరిన్ని వార్తలు