Rain Alert: కన్యాకుమారి తీరంలో వాయుగుండం

26 Dec, 2022 08:56 IST|Sakshi

13 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం 

చెన్నై, శివారు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి జోరువాన 

సముద్రంలో అలల ఉధృతి 

వేటకు దూరంగా లక్ష మంది జాలర్లు 

సాక్షి, చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శ్రీలంక తీరాన్ని దాటి కన్యాకుమారి తీరంలోకి సోమవారం ప్రవేశించనుంది. ఈప్రభావంతో 13 జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండడంతో వేటకు జాలర్లు వెళ్ల లేదు. ఈశాన్య రుతు పవనాల సీజన్‌ ముగింపు దశకు చేరింది. మరో వారం పాటు ఈ పవనాల ప్రభావం రాష్ట్రంపై  ఉండనుంది. ఈ పరిస్థితుల్లో బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వాయుగుండంగా మారింది.

ఇది ఆదివారం శ్రీలంకలోని యాల్పానం వద్ద తీరాన్ని తాకి మళ్లీ బంగాళాఖాతంలోకే ప్రవేశించింది. ఈ ప్రభావంతో శనివారం రాత్రి నుంచి చెన్నై, దాని శివారు జిల్లాల్లో మోస్తారుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ముసురు వర్షం పడింది. విల్లుపురం, పుదుచ్చేరి, కారైక్కాలో కొన్ని చోట్ల వరుణుడు బీభత్సం సృష్టించాడు. చెన్నైలో రాత్రంతా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆగమేఘాలపై కార్పొరేషన్‌ సిబ్బంది ఈ నీటిని తొలగించారు. ఇక మెరీనా తీరంలోకి మళ్లీ వర్షపు నీరు చేరింది. ఫలితంగా ఇసుక మేటలు చెరువును తలపించాయి.

అధికారులు అప్రమత్తం
వాయుగుండం కన్యాకుమారి తీరంలోకి సోమవారం ప్రవేశించనుంది. ఈ ప్రభావంతో కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాశి, తూత్తుకుడి, రామనాథపురం, శివగంగై, పుదుకోట్టై, నాగపట్నం తదితర 13 జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆయా జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సముద్రంలో అలలు ఉవ్వెతున్న ఎగసి పడుతుండడంతో జాలర్లు తమ పడవలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రాష్ట్రంలోని హార్బర్‌లలో ఇప్పటికే ఒకటో నంబరు ప్రమాద సూచికను ఎగుర వేశారు. సముద్రంలో గాలి ప్రభావం అధికంగా ఉండడంతో లక్ష మంది జాలర్లు వేటకు వెళ్ల లేదు.  

మరిన్ని వార్తలు