ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కీలక మలుపు.. సీఏ గోరంట్ల బుచ్చిబాబు అరెస్ట్‌

8 Feb, 2023 08:50 IST|Sakshi
గతంలో కవితతో వైరల్‌ అయిన బుచ్చిబాబు ఫొటో

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన చార్టెడ్‌ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబును దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్ట్‌ చేసింది. 

రామచంద్ర పిళ్లైకి చార్టెడ్‌ అకౌంటెంట్‌గా వ్యవహరించాడు గోరంట్ల బుచ్చిబాబు. ఈ కేసులో రామచంద్ర పిళ్లై 14వ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో బుచ్చిబాబు కీలక పాత్ర పోషించినట్లు నిర్ధారణ కాగా.. గతంలోనూ సీబీఐ కూడా అతని ఇంట్లో సోదాలు నిర్వహించింది. అంతేకాదు పలుమార్లు ఢిల్లీకి పిలిచి విచారించింది కూడా.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో, తద్వారా హైదరాబాద్‌కు చెందిన హోల్‌సేల్, రిటైల్ లైసెన్సీలకు  లాభం చేకూర్చడంలో పాత్ర పోషించినందుకు గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేసింది సీబీఐ. మద్యం విధానం రూపకల్పనలో హైదరాబాదుకు చెందిన పలు సంస్థలకు భారీగా లబ్ధి చేకూరే విధంగా బుచ్చిబాబు వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్ల రూపాయల ముడుపులు ఆమ్‌ ఆద్మీ పార్టీకి చేతులు మారడంలో బుచ్చిబాబు కీలకపాత్ర పోషించినట్లు సమాచారం.  వైద్య పరీక్షల అనంతరం.. అరెస్ట్‌ చేసిన గోరంట్ల బుచ్చిబాబును రౌస్‌ఎవిన్యూ స్పెషల్‌ కోర్టులో ప్రవేశపెట్టనుంది సీబీఐ. ఆపై విచారణ కోసం కస్టడీకి కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. గోరంట్ల బుచ్చిబాబు గతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీఏగా పనిచేసినట్లు ఆ మధ్య కొన్నికథనాలు తెరపైకి వచ్చాయి. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో.. లిక్కర్‌ స్కాం లింకులతో దేశవ్యాప్తంగా నలభై చోట్ల ఈడీలు సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో దోమలగూడ(హైదరాబాద్‌) అరవింద్‌నగర్‌లోని శ్రీసాయికృష్ణ రెసిడెన్సీలోని మొదటి అంతస్తులో ఉన్న బుచ్చిబాబు కార్యాలయంలో ఈడీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది కూడా.

కవిత స్థాపించిన తెలంగాణ జాగృతి రిజస్టర్ట్ అడ్రస్‌కు సమీపంలోనే ఉన్న గోరంట్ల అసోసియేట్స్ ఆఫీసులో ఈ దాడులు జరగడం సరికొత్త అనుమానాలకు దారితీసింది అప్పట్లో. అంతేకాదు కవితతో కలిసి దిగిన ఫొటోలు సైతం బాగా వైరల్‌ అయ్యాయి.

మరిన్ని వార్తలు