కేరళ పేలుళ్లు.. ఢిల్లీ, ముంబయిల్లో హైఅలర్ట్‌..

29 Oct, 2023 15:44 IST|Sakshi

తిరువనంతపురం: కేరళ బాంబు పేలుళ్ల ఘటనతో దేశ రాజధాని, ముంబయిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ, ముంబయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పేలుళ్ల నేపథ్యంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పండుగల సీజన్, రాబోయే క్రికెట్ మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలో ముంబయి పోలీసులు కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ముంబయిలోని యూదుల కేంద్రమైన చాబాద్ హౌస్ వద్ద ఇప్పటికే భద్రతను పెంచారు.

"నిఘా సంస్థలతో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం నిరంతరం టచ్‌లో ఉంది. ఏదైనా అనుమానిత సమాచారం అందితే తీవ్రంగా పరిగణిస్తోంది. రద్దీగా ఉండే ప్రదేశాలలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం." అని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. 

కేరళ, కలమస్సేరి సమీపంలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ పేలుడు ఘటన జరిగింది. ఈ ప్రదేశం కొచ్చికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. దాదాపు 2000 మంది ప్రజలు ఈ ప్రార్థనా శిబిరానికి హాజరయ్యారు. మూడో రోజుల ప్రార్థనల్లో భాగంగా ఆదివారం చివరి రోజు కావడం గమనార్హం. ఈ పేలుడులో ఐఈడీ పదార్ధాలను ఉపయోగించినట్లు కేరళ పోలీసులు తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్‌) దర్యాప్తు చేపట్టాయి.  పేలుళ్లు ఉగ్రదాడిగా పరిగణిస్తున్నారు.

కేరళ సీఎం పినరయ్ విజయన్‌తో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. దర్యాప్తు చేపట్టాలని ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ ఉన్నతాధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఉగ్రవాద నిరోధక పరిశోధనలు, కార్యకలాపాల్లో నైపుణ్యం కలిగిన రెండు కేంద్ర ఏజెన్సీలకు చెందిన ప్రత్యేక బృందాలను సంఘటనా స్థలానికి పంపాలని షా ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి: కేరళలో భారీ పేలుడు.. ఉగ్రదాడి కలకలం!

మరిన్ని వార్తలు