'పాక్‌కు ఎందుకు వెళ్లలేదు..?' విద్యార్థులపై టీచర్ అనుచిత వ్యాఖ్యలు..

29 Aug, 2023 11:45 IST|Sakshi

ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ టీచర్‌ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన ఘటన మరవక ముందే ఢిల్లీలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. దేశ విభజన సమయంలో పాక్‌కు ఎందుకు వెళ్లలేదని తమ టీచర్ ప్రశ్నించినట్లు నలుగురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సదరు టీచర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

హేమా గులాటి, గాంధీ నగర్‌లోని ప్రభుత్వ సర్వోదయ బాల్ విద్యాలయాలో పనిచేస్తున్నారు. టీచర్ తమపై మతపరమైన వ్యాఖ్యలు చేసినట్లు నలుగురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాబా, మక్కా, ఖురాన్‌పై కూడా వ్యాఖ్యలు చేశారని పోలీసులకు తెలిపిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశ విభజన సమయంలో పాక్‌కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించినట్లు చెప్పారు. స్వాతంత్య్ర సమరంలో ఎలాంటి పాత్ర పోషించకుండానే దేశంలో ఉంటున్నారని వ్యాఖ్యానించినట్లు విద్యార్థులు పోలీసులకు తెలిపారు. 

బాధిత విద్యార్థుల కుటుంబ సభ్యులు ఈ ఘటనపై స్పందించారు. పాఠశాలల్లో ఇలాంటి విద్వేషాలకు తావివ్వకూడదని చెప్పారు. ఆ టీచర్‌ని స్కూల్‌ నుంచి బహిష్కరించాలని కోరారు. సరైన అవగాహన లేని విషయాలపై టీచర్లు మాట్లాడకూడదని చెప్పారు. విద్యార్థుల్లో వైషమ్యాలను కలిగించే విధంగా పాఠాలు ఉండకూడదని అన్నారు. 

ఈ ఘటనపై స్థానిక ఆప్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ బాజ్‌పై ఈ ఘటనపై స్పందించారు. టీచర్ ఇలా మాట్లాడకూడదని అన్నారు. పిల్లలకు మంచి పాఠాలు చెప్పే విధంగా ఉండాలని చెప్పారు. మతాలపై టీచర్లు తమ సొంత వైఖరిని తరగతి గదిలో మాట్లాడకూడదని అన్నారు. ఆ టీచర్‌పై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

యూపీలో ఇటీవల ఓ టీచర్ తరగతి గదిలో ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించింది. అయితే ఈ ఘటనలో తాను మతపరమైన ఉద్దేశంతో చేయలేదని చెప్పారు. విద్యార్థులకు బుద్ధి చెప్పే క్రమంలో ఇలా చేయాల్సి వచ్చిందని సమాధానమిచ్చుకున్నారు.  

ఇదీ చదవండి: Muzaffarnagar School Video Controversy: స్టూడెంట్‌పై దాడి వైరల్‌.. సమర్థించుకున్న టీచ‌ర్‌ .. ఏం చెప్పిందంటే!


 

మరిన్ని వార్తలు