భారత్‌లో జీరో రూపాయి నోటు ఉందని మీకు తెలుసా!...

20 Dec, 2021 16:47 IST|Sakshi

Zero Rupee Note Create For Corruption: ఎవరైనా మీకు సున్నా రూపాయి నోటును అందజేస్తే మనం కచ్చితంగా అది నకిలీ నోటుగా భావించి వదిలేయడం లేదా పడేయడమో చేస్తాం. మనందరి దృష్టిలో రూ.10, 20 నుంచి రూ.500, 2000లు విలువ కలిగిన నోటులు. కానీ సున్న రూపాయి నోటుకి కూడా అది పెద్ద విలువ ఉంది. అది కేవలం సాధారణ కాగితం కాదని మీకు తెలిస్తే?  బహుశా మీరు ఆశ్చర్యపోవచ్చు.

(చదవండి: రాయ్‌ తుపాను ధాటికి 208 మంది మృతి)

భారతదేశంలో సున్నా-రూపాయి నోటు అనేది లంచాలు లేకుండా చేసేలా మొత్తం వ్యవస్థాగత రాజకీయ అవినీతిని అరికట్టడానికి ఒక సాధనంగా జారీ చేసిన బ్యాంకు నోట్ల అనుకరణ. పైగా దీన్ని 50 రూపాయల నోటును పోలి ఉండేలా తయారు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నాలుగు మూలస్థంభాలుగా శాసనసభ, కార్యనిర్వాహకుడు, న్యాయవ్యవస్థ, మీడియా అని మాత్రమే తెలుసు. కానీ ఐదవ స్థంభంగా ప్రభుత్వేతర సంస్థ ఒకటి పనిచేస్తుందని మనకెవరికి తెలియదు.

తమిళనాడుకు చెందిన ఎన్‌జీవో ఐదవ  స్తంభంలా శాంతియుత ప్రజాస్వామ్య రక్షణకై తనవంతు కీలక పాత్రను పోషిస్తోంది. అంతేకాదు 2007లో లంచం తీసుకోవడానికి నిరాకరించడాన్ని నమోదు చేసేందుకు జీరో రూపాయి నోటును రూపొందించింది. అంతేకాదు ఈ నోటు రూ. 50కి చాలా సారూప్యంగా కనిపిస్తున్నప్పటికీ, వాటిపై "అన్ని స్థాయిలలో అవినీతిని నిర్మూలించండి"  "నేను లంచం తీసుకోనని లేదా ఇవ్వనని వాగ్దానం చేస్తున్నాను." అనే అవినీతి వ్యతిరేక నినాదాలు ఉంటాయి.

పైగా దశాబ్ద కాలంగా  ప్రతి నెలా ఈ సున్న రూపాయి నోట్ల పంపిణీ జరుగుతోంది. అయితే నిజానికి అవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)చే ముద్రించినవి కావు. ఈ ఐదవ స్థంభానికి అధ్యక్షుడు అయిన విజయ్‌ ఆనంద్‌ ఈ కార్యక్రమ సమర్థత పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయ్‌ ఆనంద్‌ మాట్లాడుతూ..."ప్రజలు ఇప్పటికే వాటిని ఉపయోగించడం ప్రారంభించారు.  అది పని చేస్తోంది కూడా. ఒక ఆటో-రిక్షా డ్రైవర్‌ను అర్ధరాత్రి ఒక పోలీసు తన ఆటోని ఆపి డబ్బు ఇస్తే వెళ్లిపోవచ్చు అని అన్నప్పుడు ఆ డ్రైవర్‌ ఈ సున్న రూపాయి నోటుని ఇచ్చాడు. ఆ పోలీసు ఒక్కసారిగా షాక్‌ అయ్యి  నవ్వుతూ ఆ ఆటో డ్రైవర్‌ని విడిచి పెట్టాడు.

దీని ఉద్దేశ్యం లంచం వద్దు అని ప్రజలలో విశ్వాసం కలిగించడమే" అని అన్నారు. ఈ మేరకు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం వంటి వివిధ భాషల్లో లక్షలాది జీరో రూపాయల నోట్లను ముద్రించాం అని చెప్పారు. అంతేకాదు ముఖ్యంగా అవినీతి, లంచగొండితనంపై అవగాహన కల్పించేందుకు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు,  ఇతర బహిరంగ ప్రదేశాల్లో వాలంటీర్లు పంపిణీ చేశారని విజయ్‌ ఆనంద్‌ చెబుతున్నారు.

(చదవండి: ‘ఆ రోజు చేసిన పని నన్ను పదే పదే కలచివేసింది')

మరిన్ని వార్తలు