ప్రకృతి విపత్తులతో వణికిపోయిన దైవభూమి

8 Feb, 2021 13:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకున్న ప్రకృతి విలయం గతాన్ని గుర్తుచేస్తోంది. ఇప్పటికే అనేకసార్లు నదులు ఉప్పొంగి వేలాది మంది ప్రజలను బలితీసుకున్నాయి. తాజాగా సంభవించిన ధౌలిగంగా నది ప్రమాదం మరోసారి హిమాలయ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. మంచుచరియలు విరిగిపడటంతో ఉప్పొంగిన ధౌలీనది పెను విపత్తునే సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 10 మృతదేహాలు లభ్యంకాగా.. ఇంకా 170 మంది ఆచూకీ లభ్యం కాలేదు. 16 మంది సహాయక సిబ్బంది రక్షించింది.

గతంలో ఉత్తరాఖండ్‌లో సంభవించిన‌ ప్రకృతి విలయాలు

  • 1991 అప్పటికి ఇంకా ఉత్తరప్రదేశ్‌ నుంచి విడిపోలేదు. 1991 అక్టోబర్‌లో భూకంప లేఖినిపై 6.8 తీవ్రతతో భారీ భూకంపం ఉత్తర కాశీ కేంద్రంగా సంభవించింది. అప్పుడు 768 మంది చనిపోయారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 
  • 1998 పితోరాగఢ్‌ జిల్లాలోని మాల్పా గ్రామంపై కొండచరియలు విరిగిపడి మొత్తం గ్రామాన్నే నామరూపాలు లేకుండా చేశాయి. ఆ ఘటనలో 55 మంది కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రికులు సహా 255 మంది చనిపోయారు. 
  • 1999 భూకంప లేఖినిపై 6.8 తీవ్రతతో చమోలి జిల్లాను కుదిపేసిన భూకంపం కారణంగా 100 మంది చనిపోయారు. పక్కనున్న రుద్రప్రయాగ జిల్లాపై కూడా ఈ భూకంపం ప్రభావం చూపింది. 
  • 2013 జూన్‌ నెలలో కొన్ని రోజుల పాటు నిరంతరాయంగా కురిసిన భారీ వర్షాలతో వరదలతో పాటు కొండచరియలు విరిగిపడడంతో రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ విలయంలో 5700 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరిన్ని వార్తలు