ఇషాంత్‌ శర్మ కెరీర్‌లో మరో మైలురాయి

8 Feb, 2021 13:39 IST|Sakshi

చెన్నై: టీమిండియా పేసర్‌ ఇషాంత్‌ శర్మ టెస్టు కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో 300 వికెట్లు తీసిన ఆరో భారత బౌలర్, మూడో పేసర్‌‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా ఇషాంత్‌ ఈ రికార్డు నమోదు చేశాడు. నాలుగో రోజు ఆటలో భాగంగా, పర్యాటక జట్టు రెండో ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ డానియల్‌ లారెన్స్‌ను పెవిలియన్‌కు పంపడం ద్వారా, 98 వ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.

ఇక టీమిండియా తరఫున టెస్టు ఫార్మాట్‌లో మూడొందలు అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన క్లబ్‌లో ఇషాంత్‌ కంటే ముందు అనిల్‌ కుంబ్లే(619), కపిల్‌ దేవ్‌(434), హర్భజన్‌ సింగ్‌(417) రవిచంద్రన్ అశ్విన్(382)‌, జహీర్‌ ఖాన్‌(311)లు ఉన్నారు.  ఇక ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో జోస్‌ బట్లర్‌, జోఫ్రా ఆర్చర్‌ వికెట్లను ఇషాంత్‌ కూల్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇషాంత్‌ మొత్తంగా ఇప్పటి వరకు మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

చదవండి: 84 ఏళ్ల తర్వాత ఆ రికార్డు కనుమరుగు

మరిన్ని వార్తలు