శరవేగంగా రెస్క్యూ ఆపరేషన్‌: హృదయ విదార‍కం,ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌

16 Nov, 2023 20:30 IST|Sakshi

Uttarakhand Tunnel ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 40 మంది కార్మికులను రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.  ఉత్తరాఖండ్  సొరంగం కూలి  శిథిలాల మధ్య ఉన్న  బాధితులను కాపాడేందుక అమెరికాకు చెందిన అత్యాధునిక డ్రిల్లింగ్ పరికరం 'అమెరికన్ ఆగర్'తో సహాయక చర్యలు చేపట్టారు. అయితే వాతావరణ ప్రతికూలత, మంగళవారం రాత్రి మళ్లీ కొండ చరియలు విరిగిపడటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో టన్నెల్ బయట నిరీక్షిస్తున్న కార్మికుల కుటుంబసభ్యుల్లో ఆందోళన  మరింత పెరుగుతోంది. 

ఇది ఇలా ఉంటే ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక సూపర్‌వైజర్  తాను బాగానే ఉన్నానని, ఆందోళన చెందవద్దని తన కుమారుడికి హామీ ఇచ్చిన ఆడియో క్లిప్‌ ఒకటి గురువారం వెలువడింది. చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్, ఆహారం చేరేలా ఏర్పాటు చేసిన పైపు ద్వారా తన కొడుకుతో మాట్లాడాడు నేగి. దీంతో అతని కుమారుడు ఆకాష​ సంతోషం వ్యక్తం చేశాడు. ఎవరికీ గాయాలు కాలేదని, సరిపడా ఆహారం, నీరు అందుతున్నాయని  నాన్న చెప్పారనీ   ఆందోళన చెందవద్దని ఇంట్లో అందరికీ చెప్పమన్నారని  చెప్పాడు. అంతా మంచి జరుగుతుందని భావిస్తున్నాని తెలిపాడు. మరో కార్మికుడు మహదేవ్  బావున్నాను అని తన కుటుంబానికి చెప్పండి అంటూ ఒడియాలో చెప్పడం  కాస్త ఊరటినిస్తోంది. 

ఇది ఇలా ఉంటే  ఈ  ఘటనపై పారిశ్రామికవేత్త ఆనంద్‌మహీంద్ర స్పందించారు. హృదయ విదారకంగా ఉంది.  తొందరగానే వీరంతా ఈ ప్రమాదంనుంచి క్షేమంగా తిరిగి రావాలి. అంతేకాదు కాస్త ఆలస్యమైనా క్షేమంగా బైటికి వచ్చి, వారి కుటుంబాలతో సంతోషంగా దీపావళి వేడుక జరుపుకోవాలని  ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్‌ చేశారు.

భవన నిర్మాణ కార్మికులు సొరంగంలో చిక్కుకుని ఇప్పటికే  అయిదు రోజులైంది.  రక్షణ చర్యల్లో భాగంగా సోమవారం  55 మీటర్ల నుంచి 60 మీటర్ల శిథిలాలను తొలగించారు. అయితే ఆ ప్రాంతంలో మళ్లీ మట్టి కొట్టుకుపోవడంతో తవ్విన భాగాన్ని 14 మీటర్లకు తగ్గించారు. రాయిని డ్రిల్‌చేసి దాని ద్వారా  80 మిమీ (3 అడుగుల కంటే తక్కువ)బోర్‌ వేసి దాని ద్వారా కూలీలను రక్షించడానికి  ప్లాన్ చేస్తున్నామని జాతీయ విపత్తు సహాయ దళం చీఫ్ అతుల్ కర్వాల్ తెలిపారు. అమెరికన్ అగర్ డ్రిల్ సుమారు 12 -15 గంటల్లో 70 మీటర్ల రాళ్లను కట్‌ చేసే సామర్థ్యం ఉందన్నారు.

ప్రస్తుతం చేపట్టిన సహాయక చర్యలు ప్లాన్‌ బీ విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రెస్క్యూ ఆపరేషన్‌ అధికారి కల్నల్ దీపక్ పాటిల్ గురువారం ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యాధునిక అమెరికన్ డ్రిల్లింగ్ పరికరాలో రెస్క్యూ  ఆపరేషన్‌ కొనసాగుతోందని చెప్పారు. అటు రెండు మూడు రోజుల్లో ఆపరేషన్‌ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారని కేంద్ర మంత్రి వీకే సింగ్‌  కూడా వెల్లడించారు. విదేశీ నిపుణుల సలహాలు తీసుకుంటున్నామనీ, అనుకున్న సమయానికంటే ముందే రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుందని భావిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు