Diwali 2021 Safety Tips: శానిటైజర్లతో జాగ్రత్త! హ్యాపీ అండ్‌ సేఫ్‌ దివాళీ!!

3 Nov, 2021 16:00 IST|Sakshi

Safe Diwali Tips In Telugu: దేశవ్యాప్తంగా పిల్లా పాపలతో కలిసి దీపావళి సంబరాన్ని ఉత్సాహంగా జరుపుకునేందుకు సిద్ధమవు తున్నారు.  కుల మత ప్రాంత  విభేదాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగ దీపావళి. అయితే పలుదేశాల్లో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్న తరుణంలో కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.  ముంచు కొస్తున్న కాలుష్య భూతం కోరలకు చిక్కకుండా వీలైనంతవరకు క్రాకర్స్‌కు దూరంగా ఉండాలని కనీసం పర్యావరణ హితమైన గ్రీన్‌క్రాకర్స్‌ మాత్రమే  వినియోగించాలంటున్నారు. దీంతోపాటు  చిన్నపిల్లలు  వృద్ధులను దృష్టిలో ఉంచుకుని భారీ శబ్దాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. పెంపుడు జంతువులకు కూడా పెద్ద పెద్ద శబ్దాలు హానికరం.

మరీ ముఖ్యంగా టపాసులు అంటే పిల్లలకు చాలా ఇష్టం. ఉత్సాహంగా దూసుకుపోతూ వుంటారు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఆనందంగా దీపావళి జరుపు కోవచ్చు. ప్రమాదాలు లేని దీపావళి కోసం జాగ్రత్తలు పాటిద్దాం.. తద్వారా సర్వత్రా వెలుగు దివ్వెల పండుగ దీపావళి  కాంతులు నింపుదాం.

శానిటైజర్ల వినియోగంలో అప్రమత్తత
దీపావళి పండుగలో కీలకమైన దీపాలు, కొవ్వొత్తులను వెలిగించే ముందు శానిటైజర్ల వాడకాన్ని మానుకోండి. ముఖ్యంగా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లను వాడకండి. ఎందుకంటే  శానిటైజర్లు మండించే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇది తీవ్రమైన అగ్ని ప్రమాదాలకు కారణం కావచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా నీరును, పేపర్ సబ్బులు బెటర్‌. అలాగే దీపాలను వెలిగించే ముందు టపాసులు వెలిగించిన తరువాత చేతులు సరిగ్గా కడుక్కోవాలి. 

దీపావళికి తగిన దుస్తులు
ఉదయం నుంచి ఎథ్నిక్ వేర్, డిజైనర్‌ వేర్‌ ఎలాంటి దుస్తులు ధరించినా పరవాలేదు కానీ, టపాసులు కాల్చే సమయంలో షిఫాన్, జార్జెట్, శాటిన్, సిల్క్ ఫ్యాబ్రిక్స్‌కు దూరంగా ఉండాలి.  దీనికి బదులుగా, కాటన్ సిల్క్, కాటన్ లేదా జ్యూట్ దుస్తులను ధరించడం మంచిది.


 
టపాసులు కాల్చేటప్పుడు  కాస్త వదులైన మందపాటి కాటన్ దుస్తులను ధరించడం, తప్పనిసరిగా కాళ్లకు చెప్పులు ధరించడం మంచిది.
కాకరపువ్వొత్తులు, మతాబులు, పెద్ద పెద్ద బాంబులు వంటివి కాల్చేటప్పుడు  చిన్న పిల్లలకు  పెద్దలెవరైనా  సహాయంగా ఉండటం మంచిది.
టపాసులు, బాంబులు వంటి పేలుడు పదార్థాలను  గృహసముదాయాల వద్ద కాకుండా దూరంగా ఆరుబయట ప్రదేశంలో కాల్చడం మంచిది. 
కొన్ని రకాల టపాసులను కాల్చేసిన తర్వాత  ఆవి పూర్తిగా ఆరిపోయాయో లేదు తనిఖీ చేసుకోవాలి.  పిల్లలు తొందరపాటుగా వాటి సమీపానికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి.
ఇంట్లో ఉన్న అందరూ  రాకెట్లు, తారాజువ్వలు వంటివి కాల్చేటప్పుడు అవి ఇతరుల ఇళ్లలోకి చొరబడకుండా దిశ సరిగా ఉండేలా చూసుకోవాలి.
దీపావళి టపాసులు కాల్చేటపుడు కళ్లకు రక్షణగా కళ్లజోడు ధరించడం కూడా చాలా మంచిది. ఈ జాగ్రత్తల విషయంలో తల్లిదండ్రులు, పెద్దలు బాధ్యతగా వ్యవహరిస్తే.. హ్యాపీ అండ్‌ సేఫ్‌ దివాలి  సొంతమవుతుంది.

కరోనా సమయంలో సంబంధిత మార్గదర్శకాలను పాటిస్తూ సురక్షితంగా దీపావళిని జరుపుకోవాలి. ప్రతీ ఏడాది దీపావళి తరువాత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి పెరగడం మనం చూస్తున్నాం. దీంతో శ్వాసకోశ రుగ్మతలు, సంబంధిత బాధితులు మరింత  అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అందులోనూ ప్రస్తుత  కోవిడ్‌-19 సమయంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, కాలుష్యమైన  గాలి చాలా ప్రమాదకరమని పల్మనాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు