మా రేంజ్‌ అంతే.. డాక్టర్లకు వల-వెయ్యి కోట్ల తాయిలాలపై డోలో 650 తయారీ కంపెనీ స్పందన

20 Aug, 2022 12:06 IST|Sakshi

ఢిల్లీ/బెంగళూరు: డోలో-650 ప్రమోషన్‌లో భాగంగా.. వైద్యులకు రూ. వెయ్యి కోట్ల ఉచితాలు పంచిందని మైక్రో ల్యాబ్స్‌ లిమిటెడ్‌ కంపెనీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో.. తీవ్రంగా స్పందించిన సుప్రీం కోర్టు, ఈ విషయంపై నివేదిక సమర్పించాలంటూ కేంద్రానికి పదిరోజుల గడువుతో నోటీసులు సైతం జారీ చేసింది. అయితే.. 

ఈ ఆరోపణలు నిరాధరమైనవంటూ బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్‌ లిమిటెడ్‌ కొట్టిపారేసింది. కరోనా తారాస్థాయిలో ఉన్న సమయంలోనే డోలో అమ్మకాల ద్వారా రూ.350 కోట్ల వ్యాపారం జరిగిందని, అలాంటిది వాటి ప్రమోషన్‌ కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నామనే ఆరోపణలు రావడం విడ్డూరంగా ఉందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. 

డోలో-650 అనేది NLEM (ధరల నియంత్రణ) పరిధిలోకే వస్తుంది. పైగా కేవలం కొవిడ్‌ ఏడాదిలోనే రూ. 350 కోట్ల బిజినెస్‌ జరిగితే.. అలాంటి బ్రాండ్‌ కోసం వెయ్యి కోట్ల రూపాయలతో మార్కెటింగ్‌ చేయడం అసలు సాధ్యమయ్యే పనేనా? అంటూ మైక్రో ల్యాబ్స్‌ లిమిటెడ్‌ మార్కెటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జయరాజ్‌ గోవిందరాజు ప్రశ్నిస్తున్నారు. అలాగే కరోనా టైంలో కేవలం డోలో-650 ట్యాబ్లెట్స్ మాత్రమే కాదని.. విటమిన్‌ ట్యాబ్లెట్స్‌ సైతం భారీగానే బిజినెస్‌ చేశాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారాయన. 

ఇదిలా ఉంటే డోలో 650 ప్రమోషన్‌లో భాగంగా.. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులకు వెయ్యి కోట్ల రూపాయాల తాయిలాలు ఇచ్చిందంటూ ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎంఎస్‌ఆర్‌ఏఐ) అనే స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో) ఆరోపించింది. ఇటీవల డోలో–650 ఎంజీ తయారీ కంపెనీ ప్రాంగణాల్లో సెంట్రల్‌ బోర్డు ఫర్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌(సీబీడీటీ) సోదాలు చేసి ఈ అంశాన్ని బహిర్గతంచేసిందని సుప్రీంకోర్టుకు విన్నవించింది. పారాసెటమాల్ నిర్దిష్ట సూత్రీకరణలు(certain formulations) 500 mgm నియంత్రణలో ఉన్నట్లుగా ధర నియంత్రణలో చూపిస్తుంది. కానీ, 650 mgm పారాసెటమాల్ కిందకు రాదు. కాబట్టి వారు ఎక్కువ ధరలకు మందులను అమ్మవచ్చు అనేది సదరు ఎన్జీవో ఆరోపణ. 

ఇక దీన్నొక తీవ్ర అంశంగా పరిగణించిన అత్యున్నత న్యాయస్థానం, కేంద్రానికి నోటీసులు పంపింది. ఈ సందర్భంగా.. బెంచ్‌లో ఉన్న జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సైతం తనకు కూడా కరోనా టైంలో వైద్యులు డోలో-650నే రిఫర్‌ చేయడాన్ని గుర్తు చేశారు.

ఇదీ చదవండి: Dolo-650ని సిఫార్సు చేస్తే.. చాలు!!

మరిన్ని వార్తలు