కోర్టు హాల్‌ నుంచి వెళ్లిపోండి.. సీజేఐనే బెదిరిస్తున్నారా?

3 Mar, 2023 05:38 IST|Sakshi

న్యూఢిల్లీ: న్యాయవాదుల చాంబర్ల కోసం సుప్రీంకోర్టు ప్రాంగణంలోని కొంత స్థలం కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌(ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు వికాస్‌ సింగ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. జస్టిస్‌ చంద్రచూడ్, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జేబీ పార్ధివాలాల ధర్మాసనం ఎదుట సంబంధిత కేసు విషయమై సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ తన వాదనలు వినిపించారు. ‘ అప్పూ ఘర్‌ స్థలం ఎస్‌ఈబీఏ పిటిషన్‌ కారణంగానే సుప్రీంకోర్టు చేతికొచ్చింది.

కానీ అందులో కేవలం ఒక్క బ్లాక్‌ మాత్రమే ఎస్‌ఈబీఏ, బార్‌కు కేటాయించారు. సంబంధిత కేసు ఆరునెలలైనా విచారణకు నోచుకోవట్లేదు’ అని వికాస్‌ గట్టిగా మాట్లాడారు. దీంతో సీజేఐ ఆగ్రహంగా.. ‘ ‘సీజేఐనే బెదిరిస్తున్నారా ? ఇలాగేనా ప్రవర్తించేది ? కోర్టు హాల్‌ నుంచి వెళ్లిపోండి. మార్చి 17న విచారిస్తాం’ అని సీజేఐ ఆగ్రహంగా మాట్లాడారు. 2000 మార్చి 29వ తేదీ నుంచి ఇక్కడే ఉన్నాను. 22 ఏళ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నా. ఎప్పుడూ ఇలా ఎవరితో ఇంతగా ఇబ్బంది పడలేదు’ అని సీజేఐ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు