ముఖ్యమంత్రి బావమరిదిపై ఈడీ కేసు.. రూ. 6.45 కోట్ల ఆస్తులు సీజ్‌ 

23 Mar, 2022 14:07 IST|Sakshi

రాజకీయ కక్షసాధింపన్న శరద్‌ పవార్‌

దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది: నానాపటోలే

ముఖ్యమంత్రి రాజీనామాకు డిమాండ్‌ చేసిన నితేశ్‌ రాణే

సాక్షి ముంబై: ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే సతీమణి సోదరుడైన శ్రీధర్‌ పాటన్కర్‌కు వ్యతిరేకంగా ఈడీ చర్యలు చేపట్టింది. ఇందులో బాగంగా సుమారు రూ. 6.45 కోట్ల విలువలైన ఆస్తులను మంగళవారం జప్తు చేసింది. వీటిలో థాణేలోని నీలంబరీ ప్రాజెక్టులోని 11 ఫ్లాట్స్‌ ఉన్నాయి. వీటిని సీల్‌ చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా పుష్పక్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల డిమోనిటైజేషన్‌ మోసం కేసుకు సంబంధించి ఈ చర్యలను ఈడీ చేపట్టిందని తెలిసింది. పుష్పక్‌ బులియన్‌ అనే కంపెనీ మనీలాండరింగ్‌ కేసులో దర్యాప్తు చేస్తున్న ఈడీ... అక్కడ స్వాహా చేసిన నిధులను శ్రీ సాయిబాబా గృహనిర్మితి ప్రైవేట్‌ లిమిటెడ్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ల్లో ఇన్వెస్ట్‌ చేశారని ఏజెన్సీ ఆరోపించింది.

శ్రీసాయిబాబా గృహ నిర్మితి ప్రైవేట్‌ లిమిటెడ్‌ను శ్రీధర్‌ మాధవ్‌ పాటంకర్‌ సొంత సంస్థగా పేర్కొన్నది. మనీ లాండరింగ్‌ చట్టం కింద 11 రెసిడెన్షియల్‌ ఫ్లాట్లను జప్తు చేసేందుకు ప్రొవిజనల్‌ ఆర్డర్‌ను జారీ చేసి, రూ.6.45కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఈ సంఘటన ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని రేకెత్తించింది. ఇప్పటివరకు మహావికాస్‌ ఆఘాడి నేతల వరకే పరిమితమైన ఈడీ దాడులు మంగళవారం ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే బావమరిది వరకు చేరుకోవడంతో ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించిందని చెప్పవచ్చు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నిస్తుందన్న వాదనలకు ఈ ఘటన బలం చేకూర్చింది. 

అయిదేళ్ల కిందట ఈడీ ఎవరికీ తెలియదు: శరద్‌ పవార్‌ 
కక్ష సాధింపుకోఐసం ఈడీ లాంటి సంస్థల దుర్వినియోగం జరుగుతోందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ ఆరోపించారు. రాజకీయంగా ఎదిగేందుకు బీజేపీ ఇలా ప్రత్యర్థులను ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేపట్టిందని ఆయన ఆరోపించారు. అయిదేళ్ల కిందట ఈడీ ఎవరికి తెలియదు. కాని నేడు చిన్న చిన్న పల్లెల్లో కూడా ఈడీ గురించి చర్చలు జరుగుతున్నాయంటూ కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో శరద్‌ పవార్‌ మండిపడ్డారు.  

అవి రాజకీయ ప్రతీకార దాడులు: రౌత్‌ 
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే బావమరిది శ్రీధర్‌ మాధవ్‌ పాటంకర్‌పై ఈడీ దాడులు, రాజకీయ ప్రతీకార దాడులేనని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ ఆక్షేపించారు. తాము అధికారంలో లేనిచోట అధికార కాంక్షతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన మంగళవారం ఆరోపించారు. అయితే ఈ చర్యల వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ అన్నారు. కేంద్ర ఏజెన్సీలను ఇలా దుర్వినియోగపరచడం ప్రస్తుతం దేశం ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్యగా ఆయన అభివర్ణించారు. కొందరిని వేధించే లక్ష్యంతోనే కేంద్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
 
ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకే: జితేంద్ర అవాడ్‌ 
ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకే ఈ దాడులు జరుగుతున్నాయని ఎన్సీపీ నేత జితేంద్ర అవాడ్‌ పేర్కొన్నారు. ఇదంతా కేంద్ర కుట్రపూరిత రాజకీయాల్లో భాగమే అన్నారు. అయితే ప్రజలందరికీ వాస్తవాలు, అవాస్తవాలేంటి అన్నది తెలుసని ఆయన చెప్పారు. 

దర్యాప్తు సంస్థల దురుపయోగం: నానా పటోలే 
ఈ సంఘటన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత కొంతకాలంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను చేస్తున్న దురుపయోగమేనని మçహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే పేర్కొన్నారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మహావికాస్‌ అఘాడి ప్రభుత్వం అధికారంలో ఉండడం మింగుడు పడని బీజేపీ ఇలా కుట్ర రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించారు. మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాల్లో భాగమే ఈ దాడులని అన్నారు. అయితే బీజేపీ బెదిరింపులకు తాము భయపడబోమన్నారు.  

ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి: నితేశ్‌ రాణే 
ముఖ్యమంత్రి సొంత బావమరిదిపై ఈడీ చర్యలు తీసుకుంది. దీనిపై ముఖ్యమంత్రి స్పందించాలి. తన ప్రభుత్వానికి ఈ స్కాంతో సంబంధం లేదని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. దర్యాప్తు పూర్తయ్యేవరకు సీఎం పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంది. ఉద్దవ్‌ ఠాక్రే ఇంట్లో దాక్కొని కూర్చోకుండా, ఈ ఘటన బాధ్యత వహిస్తూ తన పదవికీ రాజీనామా చేయాలని నితేశ్‌ రాణే డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు