జమిలి ఎన్నికలతో ప్రజాధనం ఆదా

16 Dec, 2022 05:28 IST|Sakshi

ఎన్నికలు భారీ బడ్జెట్‌ వ్యవహారం 

రాజ్యసభలో న్యాయ శాఖ మంత్రి కిరెణ్‌ రిజిజు

న్యూఢిల్లీ:  దేశంలో ఎన్నికలు అనేవి భారీ బడ్జెట్‌ వ్యవహారంగా మారిపోయాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్‌ రిజిజు అన్నారు. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఒకేసారి(జమిలి) నిర్వహిస్తే ఎంతో ప్రజాధనం ఆదా అవుతుందని చెప్పారు. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభలో కిరెణ్‌ చెప్పారు. ఎన్నికలు ఖరీదైన అంశంగా మారిన నేపథ్యంలో జమిలి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల చట్టాల్లో సంస్కరణల కోసం లా కమిషన్‌ సమర్పించిన నివేదిక జమిలి ఎన్నికల ఆవశ్యకతను గుర్తుచేసిందన్నారు.

పరిపాలనలో స్థిరత్వం కోసం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. జమిలి ఎలక్షన్స్‌తో ప్రజలకే కాదు, పార్టీలకు, అభ్యర్థులకు కూడా లాభమేనని తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా నిర్వహించడం వల్ల ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’ని రెండుసార్లు అమలు చేయాల్సి వస్తోందని, దీనివల్ల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతోందని కిరణ్‌ రిజిజు వెల్లడించారు. దేశంలో 1951–52, 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలు జరిగాయి. అయితే, 1968, 1969లో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దయ్యాయి. దాంతో జమిలి ఎన్నికల గొలుసు తెగిపోయింది.

మరిన్ని వార్తలు