27న భవిష్యత్తు కార్యాచరణ వెల్లడి

25 Nov, 2021 06:06 IST|Sakshi

ఘజియాబాద్‌: వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు ఇప్పుడే ఆగవని, భవిష్యత్తు కార్యాచరణను ఈనెల 27న జరిగే సమావేశంలో నిర్ణయిస్తామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్‌ తికాయత్‌ బుధవారం తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రం చేసిన వాగ్దానాలపై కూడా మోదీ సర్కారును నిలదీస్తామన్నారు. ‘శనివారం మేము సమావేశం కానున్నాం. అక్కడ తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తాం. జనవరి 1 నుంచి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ప్రధాని మోదీ చెప్పారు. అదెలా చేస్తారో చెప్పాలని మేము ఆయన్ని అడుగుతాం’ అని తికాయత్‌ ట్వీట్‌ చేశారు. కేంద్ర తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఏడాదికాలంగా నిరసన ప్రదర్శనలు కొనసాగించడంతో ఆఖరుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ మూడు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఈనెల 19న ప్రకటించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు