మళ్లీ కదం తొక్కిన రైతన్న

3 Oct, 2021 06:25 IST|Sakshi

వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ పంజాబ్, హరియాణాల్లో నిరసనలు

చండీగఢ్‌: ధాన్యం సేకరణలో జాప్యాన్ని నిరసిస్తూ పంజాబ్, హరియాణాల్లో శనివారం రైతులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్త రూపం దాల్చాయి. హరియాణా సీఎం ఖట్టర్‌ నివాసంతోపాటు రెండు రాష్ట్రాల మంత్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్లను రైతులు దిగ్బంధించారు. ఈ సందర్భంగా పోలీసులతో తలపడ్డారు. బారికేడ్లను సైతం రైతులు లెక్కచేయకపోవడంతో పోలీసులు వాటర్‌ కెనన్లను ప్రయోగించి, వారిని చెదరగొట్టారు. సాధారణంగా పంజాబ్, హరియాణాల్లో అక్టోబర్‌ ఒకటో తేదీన ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లు మొదలవుతాయి.

కానీ, ఇటీవలి భారీ వర్షాల కారణంగా దిగుబడుల్లో తేమ శాతం ఎక్కువగా ఉందనే కారణంతో ప్రభుత్వం అక్టోబర్‌ 11వ తేదీకి కొనుగోళ్లను వాయిదా వేయడం అన్నదాత ఆగ్రహానికి కారణమైంది. కర్నాల్‌లో సీఎం ఖట్టర్‌ నివాసాన్ని ముట్టడించిన రైతులు, షాహాబాద్, పంచ్‌కులలోని బీజేపీ నేతలు, హరియాణా మంత్రి సందీప్‌ సింగ్‌ నివాసం వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను రైతులు ట్రాక్టర్లతో ఢీకొట్టి పగులగొట్టారు. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద ధాన్యం నింపిన ట్రాక్టర్‌ ట్రాలీలను అడ్డుగా పెట్టారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు వాటర్‌ కెనన్లను ప్రయోగించారు.  

నేటి నుంచి కొనుగోళ్లు
çపంజాబ్, హరియాణాలో ధాన్యం కొనుగోళ్లు ఆదివారం నుంచి ప్రారంభమవుతాయని కేంద్ర ఆహార శాఖ తెలిపింది. ధాన్యం దిగుబడులతో రైతులు ఇప్పటికే మండీల వద్ద వేచి చూస్తున్నారని వారికి ఇబ్బందులు తొలగించేందుకు ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. కేంద్రం సానుకూలంగా స్పందించినందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు హర్షం వ్యక్తం చేశాయి.

మరిన్ని వార్తలు