గుప్కార్‌ అధ్యక్షుడిగా ఫరూక్‌ అబ్దుల్లా ఎన్నిక

24 Oct, 2020 20:25 IST|Sakshi

కశ్మీర్‌: జమ్మూ కశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తిని పునరుద్దరించడమే కాక ఆర్టికల్‌ 370ని తిరిగి సాధించడం కోసం కశ్మీర్‌ నాయకులంతా ఏకమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌(పీఏజీడీ) పేరుతో ఓ కూటమిని ఏర్పాటు చేశారు. దీనికి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత, మాజీ సీఎం, ఫరూక్‌ అబ్దుల్లాను అధ్యక్షుడిగా, మెహబూబా ముఫ్తీని ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో శనివారం ఫరూక్‌ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ.. ‘గుప్కార్‌ కూటమి బీజేపీకి వ్యతిరేకం.. దేశానికి కాదు. కానీ‌ కూటమి దేశానికి వ్యతిరేకమని బీజేపీ అసత్య ప్రచారం చేస్తుంది. వారు దేశానికి, రాజ్యాంగానికి హానీ చేశారు. జమ్ము కశ్మీర్‌ ప్రజల హక్కులు తిరిగి వారికి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మతం ఆధారంగా విభజించడానికి వారు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి’ అన్నారు. (చదవండి: కశ్మీర్‌లో ప్రధాన పార్టీల కూటమి)

ఇక నేటి సమావేశంలో అలయన్స్‌ సభ్యులు ఆర్టికల్‌ 370 పునరుద్ధరణ, జమ్ము కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి గురించి కూడా చర్చించినట్లు తెలిపారు. ఇక అలయెన్స్‌కు తనను చైర్మన్‌గా ఎన్నుకున్నారని.. మెహబూబా ముఫ్తీని వైస్‌ చైర్మన్‌గా.. వామపక్ష నేత మహమ్మద్‌ యూసుఫ్‌ తారిగామిని కన్వీనర్‌గా.. జమ్మూ కశ్మీర్‌ పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నేత సజ్జద్‌ లోనెని అధికార ప్రతినిధిగా ఎన్నుకున్నట్లు ఫరూక్‌ అబ్దుల్లా తెలిపారు. సజ్జద్‌ లోనె మాట్లాడుతూ.. ‘వాస్తవాల గురించి త్వరలోనే శ్వేతపత్రంతో ప్రజల ముందుకు వస్తాము. ఇంతకు ముందు మన వద్ద ఉన్నవి.. ఇప్పుడు మనం కోల్పోయిన వాటిపై పరిశోధన పత్రం ఇస్తాము. రెండు వారాల్లో, మా తదుపరి సమావేశం జమ్మూలో ఉంటుంది. తరువాత మరో సమావేశం ఉంటుంది. మా పూర్వపు రాష్ట్ర జెండా మా కూటమికి చిహ్నంగా ఉంటుంది’ తెలిపారు..

మరిన్ని వార్తలు