ఘోరం: నలుగురు కరోనా రోగులు సజీవ దహనం

17 Apr, 2021 22:28 IST|Sakshi

రాయ్‌పూర్‌: చత్తీస్‌ఘడ్‌లో ఘోర సంఘటన జరిగింది. కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించి నలుగురు రోగులు సజీవ దహనమయ్యారు. ఫ్యాన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు వ్యాపించి ఆస్పత్రి అంతా
చుట్టుముట్టింది. దీంతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఊపిరి ఆడక నలుగురు కరోనా రోగులు మృతిచెందారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి భూపేశ్‌ భాగేల్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించారు.

చత్తీస్‌ఘడ్‌ రాజధాని రాయ్‌పూర్‌లోని రాజధాని ఆస్పత్రిని కరోనా రోగుల కోసం కేటాయించారు. ఆస్పత్రిలో కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. అయితే శనివారం ఫ్యాన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు ఆస్పత్రి అంతటా వ్యాపించాయి. ఈ క్రమంలో రోగులు పరుగులు పెట్టారు. వెంటనే ఆస్పత్రి సిబ్బంది, స్థానికులు రోగులను బయటకు తరలించేందుకు తీవ్రంగా శ్రమించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు అదుపులోకి వచ్చిన అనంతరం పరిశీలించగా నలుగురు మృత్యువాత పడ్డారని పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు. ఈ ఘటనకు కారణాలను పరిశీలిస్తున్నట్లు ఎస్పీ అజయ్‌ యాదవ్‌ తెలిపారు. ఈ ఘటనపై సీఎం భూపేశ్‌ భాగేల్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు.

మరిన్ని వార్తలు