ఇంటి నుంచి వెళ్లిపోయిన నలుగురు ఆడపిల్లలు.. కారణం తెలిసి అవాక్కయిన తల్లిదండ్రులు

2 May, 2022 17:40 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, బళ్లారి: పబ్జీలు, రియాలటీషోలతో ప్రభావితమైన నలుగురు చిన్నారులు ఏదైనా సాధించాలనే తపనతో ఉన్నఫళంగా ఇళ్లు వదిలారు. బస్సు ఎక్కి బెంగళూరు చేరుకోగా డ్రైవర్, కండక్టర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించి వారిని సురక్షితంగా పోలీసులకు అప్పగించారు. వివరాలు.. బళ్లారిలోని పార్వతీనగర్‌లో నివాసం ఉంటున్న రెండు కుటుంబాలకు చెందిన దాదాపు పదేళ్ల  వయసున్న ఆడపిల్లలు నలుగురు గతనెల 26న మధ్యాహ్నం ఇళ్లు వదిలారు. ఏదైనా సాధించేందుకు వెళ్తున్నామని, అంతవరకు తాము ఎక్కడున్నా పట్టించుకోవద్దని సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు.

బళ్లారిలోని కొత్త బస్టాండుకు వెళ్లి బెంగళూరు బస్సు ఎక్కారు. వారి వెంట పెద్దలు లేకపోవడంతో  డ్రైవర్, కండక్టర్‌ ఆరా తీశారు. కుటుంబ సభ్యుల వద్దకు వెళ్తున్నట్లు నమ్మబలికారు. అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో బెంగళూరులో బస్సు దిగకుండా భయం భయంగా దిక్కులు చూస్తుండటంతో డ్రైవర్, కండక్టర్‌కు అనుమానం వచ్చి ఉప్పారపేటె పోలీసు స్టేషన్‌లో  అప్పగించారు. మరో వైపు తమ పిల్లలు కనిపించడం లేదని తల్లిదండ్రులు గాలింపు చేపట్టారు. ఉప్పారపేటె పోలీసు స్టేషన్‌లో చిన్నారులు ఉన్న విషయం సామాజిక మాధ్యమాల్లో రావడంతో తల్లిదండ్రులు వెళ్లి  బళ్లారికి తీసుకొని వచ్చారు. బస్సు డ్రైవర్‌ రవికుమార్, కండక్టర్‌ నవాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

చదవండి: Divya Hagaragi Arrested: దివ్య మొబైల్‌ ముక్కలు!

మరిన్ని వార్తలు