మళ్లీ రగులుకున్న ‘ఈశాన్యం’

8 Dec, 2020 17:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అస్సాం, త్రిపుర, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో మళ్లీ అగ్గి రాజుకుంది. ఏడాది క్రితం డిసెంబర్‌ 11, 2019లో పార్లమెంట్‌ ఆమోదించిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఢిల్లీలో ఆందోళనలు అల్లర్లకు కూడా దారితీయడంతో పలువురు అమాయకులు మరణించారు. ముస్లింలను వేరుచేసి దేశ బహిష్కారం చేయడం కోసం ఈ బిల్లును తెచ్చారంటూ ఎక్కువ రాష్ట్రాల్లో ఆందోళనలు చెలరేగగా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత ప్రభుత్వం పౌరసత్వం ఇస్తుందన్న కారణంగా ఈశాన్య రాష్ట్రాల ప్రజలు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈలోగా ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో పౌరసత్వ గొడవలు సద్దు మణిగాయి.(భారత్‌ బంద్‌లో వీరేరి?)

ఇప్పుడు మళ్లీ ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. భారత్‌ వలస దేశంగా ఉన్నప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రాలు అక్రమ వలసల సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో స్వాతంత్రం వచ్చేనాటికి అక్కడి జనాభాలో 30 శాతం మంది వలస వచ్చిన వారు కాగా, ఇప్పుడు వారి సంఖ్య 80 శాతానికి చేరుకుంది. అస్సాం పలు ప్రాంతాల్లోకి బెంగాలీ మాట్లాడే వారి వలసలు ఎక్కువగా వచ్చాయి. 19, 20 శతాబ్దాల్లో వారి వలసలు ఎక్కువగా కొనసాగాయి. 1971లో బంగ్లాదేశ్‌ యుద్ధం అప్పుడు అస్సాంలోకి వలసలు ఎక్కువగా కొనసాగాయి. ఈ వలసలకు వ్యతిరేకంగా 1979 నుంచి ఆరేళ్లపాటు ఆందోళనలు తీవ్రంగా కొనసాగాయి. 1985లో అస్సాం జాతీయవాదులు కేంద్రంతో ఒప్పందం చేసుకోవడంతో ఆందోళనలు ఆగిపోయాయి.ఇప్పుడు పౌరసత్వ సవరణ బిల్లుతో బెంగాలీలు, అస్సామీలు, ట్రైబల్స్, నాన్‌ ట్రైబల్స్‌ మధ్య మళ్లీ చిచ్చు రగిల్చాయి. ప్రధానంగా అస్సాంలో ‘నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్‌’ వల్ల ఆందోళనలు ఎక్కువగా జరగుతున్నాయి.

దీనివల్ల దాదాపు 20 లక్షల మంది భారతీయ పౌరులు కాకుండా పోయారు. దీనివల్ల భవిష్యత్తులో రాష్ట్రానికి అక్రమ వలసలు పెరగుతాయని కూడా అస్సామీలు భయాందోళనలకు గురవుతున్నారు. అస్సాం, మిజోరమ్‌ మధ్య ఈ ఆందోళనతోపాటు ఇటీవల సరిహద్దు వివాదంతో ఘర్షణలు చెలరేగిన విషయం తెల్సిందే. త్రిపుర, మేఘాలయలలో కూడా ఆందోళనలు చెలరేగాయి.

మరిన్ని వార్తలు