‘దహీ’పై వెనక్కి తగ్గిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ

31 Mar, 2023 04:37 IST|Sakshi

కర్డ్‌తోపాటు ప్రాంతీయ భాషను వాడుకోవచ్చంటూ మళ్లీ ఉత్తర్వులు

చెన్నై/బెంగళూరు: పెరుగు ప్యాకెట్లపై ఇంగ్లిష్‌ ‘కర్డ్‌’కు బదులుగా హిందీలోని ‘దహీ’ముద్రించాలన్న ఆదేశాలు వివాదాస్పదం కావడంతో ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా        (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) వెనక్కి తగ్గింది. కర్డ్‌ను కొనసాగిస్తూనే పక్కనే సమానార్థం.. తెలుగులో అయితే పెరుగు, కన్నడలో మొసరు, తమిళమైతే తాయిర్‌ అని ప్రాంతీయ భాషను ముద్రించవచ్చని స్పష్టతనిస్తూ గురువారం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది.

పెరుగు ప్యాకెట్లపై కర్డ్‌కు బదులుగా హిందీ సమానార్ధం ‘దహీ’ని ముద్రించాలంటూ ఈ నెల 10వ తేదీన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. తమిళనాడు కో ఆపరేటివ్‌ మిల్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌ ‘ఆవిన్‌’బ్రాండ్‌తో, కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌(కేఎంఎఫ్‌) నంది బ్రాండ్‌తో పెరుగును విక్రయిస్తున్నాయి. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఎప్పటిలాగానే తమిళ ‘తాయిర్‌’నే వాడుతామని, ‘దహీ’అని మాత్రం వాడబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి సమాధానమిచ్చింది. అధికార డీఎంకే పార్టీ ‘నహీ టు దహీ’అంటూ ఆన్‌లైన్‌ ఉద్యమాన్ని  ప్రారంభించింది. ‘దహీ’వివాదంపై తమిళనాడు బీజేపీ విభాగం అభ్యంతరం తెలిపింది. కర్ణాటక ప్రభుత్వ అధీనంలోని కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌            (కేఎంఎఫ్‌) నందిని బ్రాండ్‌తో తీసుకువస్తున్న పెరుగు ప్యాకెట్లపై హిందీ దహీ పక్కన బ్రాకెట్లలో కన్నడ (మొసరు) ముద్రించాలంటూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఇచ్చిన మార్గదర్శకాలపై రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామి మండిపడ్డారు. ఈ చర్య కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టడమేనన్నారు. దీంతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తాజాగా సవరణ  ఉత్తర్వులిచ్చింది. 

మరిన్ని వార్తలు