హత్యాచార కేసు: 30 రోజుల్లోనే విచారణ పూర్తి.. సంచలన తీర్పు

12 Nov, 2021 15:44 IST|Sakshi

సూరత్: నాలుగేళ్లు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి అరెస్టయిన వ్యక్తికి 30 రోజుల్లోనే శిక్ష విధించింది గుజరాత్ కోర్టు. అతను దోషిగా తేలడంతో జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ ఘటన గుజరాత్‌లోని ట్రయల్ కోర్టు లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే .. అజయ్‌ నిషద్‌ అనే వ్యక్తి.. అక్టోబర్ 12న సూరత్‌లోని సచిన్‌ డీఐడీసీ ప్రాంతంలో తన ఇంటి వద్ద ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారికి మాయ మాటలు చెప్పి అక్కడి నుంచి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయం ఎవరికీ తెలియకూడదని ఆ బాలికను హత్యచేసి ఎవరూ లేని ప్రదేశంలో పడేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు లో నిషద్‌ దోషిగా తేలడంతో  అతన్ని అక్టోబర్‌ 13న పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిపై పది రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుని ప్రత్యేక కోర్టు అక్టోబర్‌ 25న విచారణను ప్రారంభించి ఐదు రోజుల్లోనే ముగించింది. దోషికి జీవిత ఖైదుతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి పీఎస్‌ కాలా గురువారం తీర్పునిచ్చారు. కాగా గుజరాత్‌లోని ట్రయల్ కోర్టు ఇంత తక్కువ వ్యవధిలో తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

చదవండి: karnataka: బస్సులో ఫుల్‌ సౌండ్‌తో పాటలు వింటున్నారా.. ఇకపై జాగ్రత్త!

మరిన్ని వార్తలు