గుండె జబ్బులు, నిమోనియా, ఆస్తమా..

27 May, 2022 06:07 IST|Sakshi

42 శాతం మరణాలకు అవే కారణం

న్యూఢిల్లీ: దేశంలో 2020లో సంభవించిన మరణాల్లో 42 శాతం మరణాలకు కేవలం గుండె జబ్బులు, నిమోనియా, ఆస్తమా కారణమని అధ్యయనంలో తేలింది. ఏడాదిలో 18,11,688 మెడికల్లీ సర్టిఫైడ్‌ మరణాల గణాంకాల ఆధారంగా ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. ‘ఇండియా రిజిస్ట్రార్‌ జనరల్, సెన్సెస్‌ కమిషనర్‌’ తాజాగా మెడికల్‌ సర్టిఫికేషన్‌ ఆఫ్‌ కాజ్‌ ఆఫ్‌ డెత్‌ 2020 పేరిట నివేదిక విడుదల చేశారు. కరోనా మహమ్మారి వల్ల 2020లో 1,60,618 మంది మృతిచెందినట్లు నివేదికలో పేర్కొన్నారు. అంటే మొత్తం మరణాల్లో కరోనా సంబంధిత మరణాలు కేవలం 8.9 శాతమే. అలాగే రక్తప్రసరణ సంబంధిత వ్యాధుల కారణంగా 32.1 శాతం మంది, శ్వాస సంబంధిత జబ్బుల వల్ల 10 శాతం మంది మరణించినట్లు గుర్తించారు.

ఇక టీబీ, సెప్టిసెమియా కారణంగా 7.1 శాతం మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధ్యయనకర్తలు తెలిపారు. అంతేకాకుండా డయాబెటిస్, పోషకాహార లేమి వంటి వాటితో 5.8 శాతం మంది, గాయాలు, విషం సేవించడం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం వంటి వాటితో 5.6 మంది, క్యాన్సర్‌తో 4.7 శాతం మంది మృతిచెందారు. 2020లో మెడికల్లీ సర్టిఫైడ్‌ మరణాల్లో 64 శాతం మంది పురుషులు, 36 శాతం మంది మహిళలు ఉన్నారు. మొత్తం మరణాల్లో 28.6 శాతం మంది(5,17,678) బాధితులు 70 ఏళ్ల వయసు దాటినవారే కావడం గమనార్హం. బాధితుల్లో ఏడాదిలోపు వయసు ఉన్నవారు 5.7 శాతం మంది ఉన్నారు. 15 నుంచి 24 ఏళ్లవారిలో 19 శాతం మందిని రక్తప్రసరణ సంబంధిత వ్యాధులే పొట్టనపెట్టుకున్నాయి.

మరిన్ని వార్తలు