భూమి పుట్టుకపై కొత్త ఆధారం

30 Mar, 2022 07:32 IST|Sakshi

Origin Of The Earth: భూమి అంతర్భాగం (ఎర్త్‌ కోర్‌) నుంచి లీకవుతున్న హీలియం వాయువు, భూమి పుట్టుకపై కొత్త ఆధారాలనిస్తోంది. ఎర్త్‌ కోర్‌ నుంచి హీలియం3 వాయువు భారీగా లీకవుతున్నట్లు తాజాగా సైంటిస్టులు కనుగొన్నారు. ఈ వాయువు నక్షత్రాల పుట్టుకకు కారణమైన నెబ్యులాలో ఎక్కువగా కనిపిస్తుంది. నెబ్యులా (నక్షత్ర ధూళి)లో హైడ్రోజన్, హీలియం అధికంగా ఉంటాయి. ఇవి క్రమంగా స్వీయ ఆకర్షణకు గురై ధూళి, వాయువులుగా మారతాయి. అనంతరం ఆయా అణువుల మధ్య మరింత ఆకర్షణ పెరిగి ఘనపదార్థ్ధాలుగా మారతాయి.

ఘనపదార్థ్ధం సైజు పెరిగే కొద్దీ దాని గ్రావిటీ (గురుత్వాకర్షణ శక్తి) పెరుగుతుంది. మరి భూమి కూడా ఇలాగే ఏర్పడి ఉంటే వాతావరణంలో భారీగా హీలియం ఉండాల్సిఉంటుంది. అయితే 400 కోట్ల సంవత్సరాల క్రితం ఏదో ఒక భారీ అంతరిక్ష శిల భూమిని ఢీకొట్టి ఉంటుందని, అప్పుడు భూవాతావరణంలో మరియు ఉపరితలంలో ఉన్న హీలియం అంతరిక్షంలోకి మాయమై ఉంటుందని సైంటిస్టులు వివరిస్తున్నారు. ఇప్పటికీ ప్రతిఏటా దాదాపు 2 కిలోల హీలియం3 వాయువు భూమి నుంచి లీకవుతోందని చెప్పారు. భూ లోపలి పొరల్లోని ఈ లీకేజీపై మరింత అధ్యయనం జరపాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.  

సోలార్‌ నెబ్యులా నుంచి పుట్టుక 
భూ అంతర్భాగంలో హీలియం 3 వాయువు కనిపించడంతో భూమి సోలార్‌ నెబ్యులా నుంచి పుట్టిందనేందుకు బలమైన ఆధారంగా సైంటిస్టులు పేర్కొన్నారు. కోట్లాది సంవత్సరాల క్రితం భూ ఆవిర్భావం జరిగింది. కానీ అది ఎలా జరిగిందనే విషయమై పలు అంచనాలున్నాయి. తాజా ఆధారంతో బిగ్‌బ్యాంగ్‌ అనంతరం సూర్యుడి పుట్టుక సందర్భంగా భూమి కూడా ఆవిర్భవించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. హీలియం3 వాయువు నిల్వలు ఇంకా భూమి అంతర్భాగంలో భారీగా ఉండొచ్చని భావిస్తున్నారు. తాజా పరిశోధన వివరాలను జర్నల్‌ ఏజీయూలో ప్రచురించారు. హీలియం3తో పాటు యురేనియం, థోరియం క్షీణతతో పలు మూలకాలు ఏర్పడి భూమి రూపుదిద్దుకొని ఉండొచ్చని పరిశోధనలో వెల్లడించారు. కేవలం ట్రిటియం అణువు రేడియోధార్మిక క్షీణత వల్ల మాత్రమే హీలియం 3 ఏర్పడుతుంది. నక్షత్ర ధూళిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.  

– నేషనల్‌ డెస్క్, సాక్షి.

(చదవండి: చర్చల్లో పురోగతి )

మరిన్ని వార్తలు