Rajnath Singh: ఆర్మీలో చేరాలనుకున్నా.. కానీ!: రాజ్‌నాథ్‌ సింగ్‌ భావోద్వేగం

19 Aug, 2022 20:11 IST|Sakshi

ఇంఫాల్‌: రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రస్తుతం రెండు రోజుల పర్యటన నిమిత్తం మణిపూర్‌లో ఉన్నారు. ఆర్మీ చీఫ్‌ జనరల్‌​ మనోజ్‌ పాండే కూడా ఆయనతోపాటు ఉన్నారు. ఆర్మీ అధికారులు, సైనికులను శుక్రవారం రాజ్‌నాథ్‌ సింగ్‌ కలిశారు. వారితో కలిసి అల్ఫాహారం చేశారు. ఇంఫాల్‌లో అస్సాం రైఫిల్స్‌ ఇండియన్‌ ఆర్మీలోని 57వ మౌంటైన్‌ డివిజన్‌ సైనికులను ఉద్ధేశించి మాట్లాడారు. ఈ మేరకు జవాన్‌ల ధైర్యసాహసాలను రాజ్‌నాథ్‌ కొనియాడారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి తన జీవితంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఇండియన్‌ ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని కలలు కన్నట్లు తెలిపారు. పరీక్ష కూడా రాసినట్లు పేర్కొన్నారు. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా చేరలేకపోయానని వెల్లడించారు.
చదవండి: Video: ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం

‘నా జీవితంలో జరిగిన ఓ సంఘటనను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా చిన్నప్పుడు నేను కూడా భారత సైన్యంలో చేరాలని అనుకున్నాను. అందుకు తగిన విధంగా ప్రిపేర్‌ అయ్యాను.  ఒకసారి షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్ష కూడా రాశాను. కానీ కుటుంబంలో ఎదురైన అనుకోని పరిస్థితులు, మా తండ్రి మరణంతో  సైన్యంలో చేరలేకపోయాను.’ అంటూ ఎమోషనల్‌ అయ్యారు. సైనిక దుస్తులను చిన్నపిల్లవాడికి ఇచ్చినా అతడి వ్యక్తిత్వంలో దేశభక్తితో కూడిన మార్పు కనిపిస్తుందన్నారు. అలా  ఆర్మీ యూనిఫామ్‌కు ఒక ప్రత్యేకత ఉంటుంది’ అని అన్నారు.

తాను ఎక్కడికి వెళ్లినా అక్కడి సైనికులను కలుస్తానని తెలిపారు. ఆర్మీ అధికారులను కలవడం తనకు ఎంతో గర్వంగా ఉంటుందన్నారు. ‘మణిపూర్ పర్యటనను ప్లాన్ చేసినప్పుడు కూడా అస్సాం రైఫిల్స్, 57వ మౌంటైన్ డివిజన్ అధికారులను కలవాలనుకుంటున్నానని (ఆర్మీ చీఫ్) పాండేకు చెప్పాను. డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఓ విధంగా దేశానికి సేవ చేస్తున్నారు. కానీ మీరు నిర్వర్తించే బాధ్యతలు ఓ వృత్తి, సేవ కంటే గొప్పదని నేను నమ్ముతున్నాను.  చాలా మందిని ఆర్మీలోకి తీసుకురావడంలో అస్సాం రైఫిల్స్ ముఖ్యపాత్ర పోషిస్తుంది’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.
చదవండి: నిజంగా విడ్డూరమే! మనుషులకే కాదు.. చేపలు, పీతలకూ కరోనా పరీక్షలు, వైరల్‌ వీడియో

మరిన్ని వార్తలు