గాలులకు బ్రిడ్జి కూలిపోవడం ఏంటయ్యా? అతని సమాధానం విని ఆశ్చర్యపోయా: నితిన్‌ గడ్కరీ

9 May, 2022 21:30 IST|Sakshi

న్యూఢిల్లీ: మీడియాకు ఆసక్తికరమైన అనుభూతుల్ని పంచుకోవడంలో ముందుంటారు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ.  వంతెనల నిర్మాణం విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గడ్కరీ.. ఈ సందర్భంగా ఆయనకు ఎదురైన ఓ అనుభవం గురించి తెలిపారు.

‘‘బీహార్‌ సుల్తాన్‌గంజ్‌ వద్ద నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జిలో కొంత భాగం ఈ మధ్య కూలిపోయింది. ఏప్రిల్‌ 29న ఈ ఘటన జరిగింది. కారణం ఏంటని నా సెక్రెటరీని అడిగా.. అతను ‘బలమైన గాలుల వీయడం వల్లే కూలింది సార్‌’ అన్నాడు. ఐఏఎస్‌ అధికారి స్థాయిలో ఉండి.. ఆయన అలాంటి వివరణ ఇచ్చేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. వెంటనే నేను.. ‘గాలులకు బ్రిడ్జి కూలిపోవడం ఏంటయ్యా. మరేదైనా కారణం అయ్యి ఉండొచ్చేమో’ అంటూ ఖుల్లాగా నా అభిప్రాయం చెప్పేశా.  

దేశంలో వంతెనల నిర్మాణంలో ఖర్చు తగ్గించాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో ఇలాంటి ఘటనలను పరిగణనలోకి తీసుకుని నాణ్యత విషయంలో కాంప్రమైజ్‌ కాకూడదంటూ ఢిల్లీలో ఓ ఈవెంట్‌కు హాజరైన గడ్కరీ వ్యాఖ్యలు చేశారు. 

ఇదిలా ఉంటే.. సుల్తాన్‌గంజ్‌లో జరిగిన ఘటనపై సీఎం నితీశ్‌ కుమార్‌ ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. సుమారు 1,700 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న భారీ బ్రిడ్జి ఇది. 2014లోనే మొదలైన పనులు.. ఇంకా పూర్తి కొనసాగుతున్నాయి. అలాంటిది గాలులకు కూలిపోవడం ఏంటన్న ఆశ్చర్యమూ వ్యక్తం అవుతోంది అంతటా.

మరిన్ని వార్తలు