క్యాన్సర్‌ కణాలకు చెక్‌!

12 Sep, 2023 05:30 IST|Sakshi

వాటిని నాశనం చేసే అతిసూక్ష్మ గోల్డ్, కాపర్‌ సల్ఫైడ్‌ రేణువుల సృష్టి

భారతీయ శాస్త్రవేత్తల బృందం ఘనత

న్యూఢిల్లీ: మహమ్మారి క్యాన్సర్‌ కణాల అంతానికి నడుం బిగించిన భారతీయ శాస్త్రవేత్తల బృందం ఆ క్రతువులో విజయవంతమైంది. అతి సూక్ష్మ బంగారు, రాగి సలై్ఫడ్‌ రేణువులను శాస్త్రవేత్తలు సృష్టించారు. రోగి శరీరంలో క్యాన్సర్‌ సోకిన చోట ఈ రేణువులను ప్రవేశపెట్టి వీటిని ఫొటో థర్మల్, ఆక్సీకరణ ఒత్తిడికి గురిచేసినపుడు ఇవి క్యాన్సర్‌ కణాలను విజయవంతంగా వధించాయి.

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ)కి చెందిన అధ్యయన బృందం సాధించిన ఈ ఘనత తాలూకు వివరాలు ఏసీఎస్‌ అప్లయిడ్‌ నానో మెటీరియల్స్‌ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. గోల్డ్, కాపర్‌ సలై్ఫడ్‌ రేణువులు క్యాన్సర్‌ కణాలను అత్యంత సులభంగా గుర్తించగలవు కూడా. రేణువులను రోగమున్న చోట ప్రవేశపెట్టాక అక్కడ కాంతిని ప్రసరింపజేయాలి. కాంతిని శోషించుకున్న రేణువులు ఉష్ణాన్ని జనింపజేస్తాయి. వేడితోపాటే విషపూరిత స్వేచ్ఛాయుత ఆక్సిజన్‌ అణువులను ఇవి విడుదలచేస్తాయి.

ఇవి క్యాన్సర్‌ కణాలను ఖతంచేస్తాయి. గోల్డ్, కాపర్‌ సల్ఫైడ్‌ రేణువులు వ్యాధి నిర్ధారణ కారకాలుగా పనిచేస్తాయి. కాంతిని సంగ్రహించి అల్ట్రాసౌండ్‌ తరంగాలను విడుదలచేస్తాయి. దీంతో ఏ దిశలో ఎన్ని క్యాన్సర్‌ కణాలు ఉన్నాయో స్పష్టంగా తెల్సుకోవచ్చు. ఈ విధానం క్యాన్సర్‌ వ్యాధి నిర్ధారణ ప్రక్రియను మరింత మెరుగుపరచనుంది. క్యాన్సర్‌ కణజాలం గుండా ఈ అ్రల్టాసౌండ్‌ తరంగాలు ప్రసరించినపుడు క్యాన్సర్‌ కణతులపై ఆక్సిజన్‌ ఆనవాళ్లు, వాటి ఆకృతులు అత్యంత స్పష్టంగా కనిపించనున్నాయి.

గతంలో ఈ రేణవులను పెద్ద పరిమాణంలో తయారుచేయగా ఐఐఎస్‌సీ శాస్త్రవేత్తలు ఈసారి అత్యంత సూక్ష్మ స్థాయిలో అంటే 8 నానోమీటర్ల పరిమాణంలో తయారుచేయగలిగారు. కాపర్‌ సలై్ఫడ్‌ ఉపరితలంపై అత్యంత సూక్ష్మమైన పుత్తడి రేణువులను చల్లి ఈ గోల్డ్, కాపర్‌ మిశ్రమధాతు రేణువులను సృష్టించారు. ఇవి ఇంత చిన్న పరిమాణంలో ఉండటంతో సులువుగా క్యాన్సర్‌ కణజాలంలోకి చొచ్చుకుపోగలవు. ఊపిరితిత్తులు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ కణాలపై ఈ రేణువులను ప్రయోగించి చక్కని ఫలితాలను సాధించారు.

మరిన్ని వార్తలు