ఐఐటీ మద్రాస్‌లో కరోనా కలకలం

15 Dec, 2020 05:26 IST|Sakshi

104 మందికి కోవిడ్‌ సోకడంతో తాత్కాలికంగా మూసివేత

సాక్షి ప్రతినిధి, చెన్నై: మద్రాసు ఐఐటీలో కరోనా కలకలం చెలరేగింది.100 మందికిపైగా  విద్యార్థులకు కోవిడ్‌ సోకడంతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాసుని తాత్కాలికంగా మూసివేశారు. మొత్తం 104 మంది విద్యార్థులకు కోవిడ్‌ సోకగా, అందరి పరిస్థితీ నిలకడగానే ఉన్నట్టు తమిళనాడు హెల్త్‌ సెక్రటరీ జె.రాధాకృష్ణన్‌ చెప్పారు. మొత్తం 444 శాంపిల్స్‌ పరీక్షించగా అందులో 104 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ నమోదయ్యింది. ముఖ్యమంత్రి పళని స్వామి ఆదేశాల మేరకు వీరందరికీ, కింగ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చ్‌లో చికిత్సనందిస్తున్నట్టు ఆయన తెలిపారు. వివిధ డిపార్ట్‌మెంట్లను, ప్రయోగశాలలను మూసివేసినట్లు ఐఐటీ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం కేవలం 700 మంది విద్యార్థులు, ప్రధానంగా రీసెర్చ్‌ స్కాలర్స్‌ మాత్రమే తొమ్మిది హాస్టల్స్‌లో ఉన్నారని,  ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. విద్యార్థులను వారి వారి గదులకే పరిమితం కావాలని, క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

విద్యార్థుల గదులకే  ప్యాకెట్లలో ఆహారాన్ని అందజేస్తున్నారు. తమిళనాడులోని అన్ని కాలేజీల్లో పీజీ రెండో సంవత్సరం, పీహెచ్‌డీ విద్యార్థులకు ఈనెల 2వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించారు. డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 7 నుంచి తరగతులు ఆరంభం అయ్యాయి. ఐఐటీలోని 66 మంది పీహెచ్‌డీ విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. మరో ఐదుగురు సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది. సోమవారం నాటికి ఈ సంఖ్య 104కి చేరింది. హాస్టల్‌ విద్యార్థులకు కరోనా సోకడంతో ఐఐటీ ప్రాంగణంలోని అన్ని విభాగాలు, లైబ్రరీలు, క్యాంటీన్లను మూసివేస్తున్నట్లు రిజిస్ట్రార్‌ సోమవారం ఒక సర్క్యులర్‌ జారీచేశారు. అధ్యాపకులు, సిబ్బంది, ప్రాజెక్టు డైరెక్టర్లు, పీహెచ్‌డీ విద్యార్థులు వర్క్‌ ఫ్రం హోం పాటించాలని ఆదేశించారు. రాష్ట్రప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి డాక్టర్‌ రాధాకృష్ణన్‌ సోమవారం ఐఐటీకి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.  

మరిన్ని వార్తలు