రికార్డు స్థాయిలో వర్షపాతం.. ఉత్తర భారతానికి ఈ పరిస్థితి ఎందుకు?..

10 Jul, 2023 16:02 IST|Sakshi

ఢిల్లీ: ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలు, బిపర్‌జోయ్‌ తుపాను ప్రభావమూ ఓ పక్క.. ఇంకోపక్క అధిక ఉష్ణోగ్రతల ప్రభావమూ ఈ యేడు వానల్ని ఆలస్యం చేశాయి. అయితే ఈలోపు రికార్డు స్థాయిలో ఉత్తరాదిన కురుస్తున్న వర్షాలు.. అతలాకుతలం చేస్తున్నాయి.

భీకర వర్షాలతో సగానికి పైగా ఉత్తర భారతం నీట మునిగింది. మరోపక్క ఆస్తి నష్టంపై ఇప్పుడే అంచనాకి రాలేని స్థితిలో.. మృతుల సంఖ్యా వందకు పైనే ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఉన్నట్లుండి ఉత్తరాదిపై వరుణుడు ఇంతగా ప్రతాపం చూపించడానికి కారణంపై భారత వాతావరణ శాఖ స్పందించింది. 

ఉత్తర భారతంలో నెలకొన్న అసాధరణ పరిస్థితిపై ఐఎండీ స్పష్టత ఇచ్చింది.  పశ్చిమ భాగంలో నెలకొన్న సంక్షోభం(వాతావరణ మార్పులు).. అదే సమయంలో రుతుపవనాల ప్రభావం వల్ల ఉత్తర భారత దేశంలో ఈ భీకర వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ అంటోంది. అలాగే జులై మొదటి వారంలో కురిసిన వర్షాలు.. మొత్తం దేశానికి లోటును భర్తీ చేశాయని తెలిపింది ఐఎండీ.  

వర్షాకాలంలో సంచిత వర్షపాతం 243.2 మిల్లీమీటర్లకు చేరుకుంది, ఇది సాధారణం 239.1 మిమీ కంటే రెండు శాతం ఎక్కువ అని IMD ప్రకటించింది. అలాగే.. జూన్ చివరి నాటి కల్లా దేశం మొత్తం మీద 148.6 మి.మీ నమోదు కాగా.. అది సాధారణ వర్షపాతం కంటే 10 శాతం తక్కువ తెలిపింది. వాస్తవానికి ఈ జులైలో సాధారణ వర్షపాతమే నమోదు అవుతుందని ఐఎండీ అంచనా వేసింది. కానీ.. వాతావరణ మార్పుల వల్ల అంచనాలు తప్పి అధిక వర్షాలు కురుస్తున్నాయి. 

ఉత్తర భారతంలో చాలా రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపోవడం, ఆకస్మాత్తుగా వరదలు పొటెత్తడంతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పలు నదులు ఉప్పోంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడుతున్నారు. వరదల ధాటికి.. వాహనాలు, రోడ్లు, వంతెనలు, భవనాలు సైతం కొట్టుకుపోతున్నాయి. 

రాజధాని ఢిల్లీ రీజియన్‌ సహా.. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హర్యానా, జమ్ము కశ్మీర్‌, రాజస్థాన్‌కూ ఇంకా వాన ముప్పు తప్పలేదని వాతావరణ శాఖ హెచ్చరించింది. యమునా నది ఉగ్ర రూపం దాల్చి.. ముంచెత్తడానికి సిద్ధమవుతోంది. 

మరోవైపు సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌.. నీటి నిల్వలపైనా ఒక ప్రకటన చేసింది. రిజర్వాయర్‌లోల నీటి సామర్థ్యం మెరుగుపడిందని పేర్కొంది.

మరిన్ని వార్తలు