India got Different Names: మన దేశానికి ఇన్ని పేర్లు ఎలా వచ్చాయి?

6 Sep, 2023 11:29 IST|Sakshi

మన దేశాన్ని ఇండియా అని పిలవాలా లేక భారతదేశం అనాలా అనే విషయంపై అటు రాజకీయ పార్టీల మధ్య, ఇటు ప్రజల మధ్య సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. మన రాజ్యాంగంలో ‘ఇండియా దట్‌ ఈజ్‌ భారత్’ అని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, వివిధ క్రీడలు, ప్రపంచ వేదికలపై ఇండియా అనే పేరు ప్రబలంగా ఉంది. అయితే మన దేశాన్ని వివిధ కాలాల్లో పలు పేర్లతో సంబోధించేవారనే విషయం మీకు తెలుసా? వీటిలో జంబూద్వీపం, ఆర్యవర్త, భరతవర్ష, హింద్, హిందుస్థాన్ మొదలైనవి అత్యంత ప్రాచుర్యం పొందిన పేర్లు. ఈ పేర్లు ఎప్పుడు వచ్చాయి? ఈ పేర్ల వెనుక ఉన్న అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్యవర్త
ఆర్యులు మన దేశాన్ని స్థాపించారని చెబుతారు. ఆర్య అంటే ఉత్తమమైనది. ఈ ప్రాంతంలో ఆర్యుల నివాసం ఏర్పరుచుకున్న కారణంగా మన దేశానికి ఆర్యవర్త అని పేరు వచ్చింది. ఆర్యవర్త సరిహద్దులు కాబూల్‌లోని కుంభా నది నుండి భారతదేశంలోని గంగా నది వరకు, అలానే కశ్మీర్ మైదానాల నుండి నర్మదా నది ఆవలి వైపు వరకు విస్తరించి ఉన్నాయి. ఆర్యుల నివాసానికి సంబంధించి పలువురు చరిత్రకారులలో ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

జంబూద్వీపం
మన దేశాన్ని పూర్వకాలంలో జంబూద్వీపం అని కూడా పిలిచేవారు. భారతదేశంలో జామున్(నేరేడు) చెట్లు అధికంగా ఉండటం వల్ల దీనికి ఈ పేరు వచ్చిందని చాలా మంది చరిత్రకారులు భావిస్తున్నారు. అదేవిధంగా జంబూ చెట్టు.. ఏనుగంత పరిమాణంలో భారీ ఫలాలను ఇస్తుందనే నమ్మకాలు ఉన్నాయి. ఈ పండ్లు పర్వతం మీద పడినప్పుడు వాటి రసం నుండి నది ఏర్పడిందని చెబుతారు. ఈ నది ఒడ్డున ఉన్న భూమిని జంబూద్వీపం అని పిలవసాగారు.

భరతవర్ష
మన భూభాగం పేరు ఎంతో ప్రజాదరణ పొందింది. మహారాజు దుష్యంతుడు, శకుంతల దంపతుల కుమారుడైన భరతుని పేరు మీదుగా దేశానికి భారత్ అనే పేరు వచ్చిందని చెబుతారు. అదేవిధంగా గురువు రిషభదేవుడు తన రాజ్యాన్ని తన కొడుకు భరతునికి అప్పగించాడని, అందుకే మన దేశానికి భరతవర్ష అని పేరు వచ్చిందని అంటారు. దశరథుని కుమారుడు, శ్రీరాముని సోదరుడు భరతుని ప్రస్తావన కూడా ఇదేవిధంగా కనిపిస్తుంది. అలాగే నాట్యశాస్త్రంలో కూడా భరతముని ప్రస్తావన ఉంది. దేశానికి ఆయన పేరు పెట్టారని కూడా అంటారు. పురాణాలలో కూడా భారతదేశ సరిహద్దులు సముద్రానికి ఉత్తరం నుండి హిమాలయాల దక్షిణం వరకు విస్తరించి ఉన్నాయని పేర్కొన్నారు. 

హిందుస్థాన్‌
పురాతన కాలంలో భారతదేశంలోని సింధు లోయ నాగరికత ఇరాన్, ఈజిప్ట్‌తో వాణిజ్య సంబంధాన్ని కలిగి ఉంది. ఇరానియన్‌లో ‘సిం’ని ‘హిం’ అని సంబోధించారట. ఫలితంగా సింధు కాస్తా హిందూగా మారిందని అంటారు. తరువాతి కాలంలో ఈ భూమి హింద్ పేరుతో ప్రసిద్ధి చెంది, చివరికి హిందువులుంటున్న ప్రదేశం  కనుక హిందుస్థాన్ అయ్యిందని చెబుతారు. 

భారతదేశం
మన దేశానికి ఈ పేరు బ్రిటిష్ వారు పెట్టారని అంటారు. బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు, వారు సింధు లోయను తొలుత ఇండస్‌ వ్యాలీ అని పిలిచేవారు. దీనితో పాటు భారత్ లేదా హిందుస్థాన్ అనే పదానికి బదులుగా ఇండియా అనే పదాన్ని ఉపయోగించసాగారు. అది వారికి పలికేందుకు చాలా సులభంగా అనిపించిందట. చాలామంది ఇండియా అనేది బ్రిటిష్ యుగానికి చిహ్నమని, అందుకే ఈ పేరులో మార్పులు చేయాలని డిమాండ్‌ చేస్తుంటారు. 
ఇది కూడా చదవండి: దేశంలో అతిపెద్ద జిల్లా ఏది?

మరిన్ని వార్తలు