మ్యాపింగ్‌ పాలసీలో కీలక సడలింపులు

16 Feb, 2021 04:13 IST|Sakshi

కేంద్రప్రభుత్వ నిర్ణయం

న్యూఢిల్లీ: భారత మ్యాపింగ్‌ పాలసీలో నిబంధనలను సడలిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జియోస్పేషియల్‌ డేటా నియంత్రణా నియమావళిలో మార్పులు చేయడం ద్వారా ఈ రంగంలో పబ్లిక్, ప్రైవేట్‌ సంస్థలకు సమానావకాశాలు ఉండేలా చర్యలు తీసుకుంది. కొత్త నిబంధనల్లో భాగంగా ఈ రంగాన్ని డీరెగ్యులేట్‌ చేయడంతో పాటు సర్వేయింగ్, మాపింగ్, యాప్స్‌ అభివృద్ధికి ప్రీ అప్రూవల్‌ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మార్పులు చేసినట్లు సైన్స్‌అండ్‌టెక్నాలజీ సెక్రటరీ అశుతోష్‌ చెప్పారు. దేశీయ సంస్థలు జియోస్పేషియల్‌ డేటా సేవలందించేందుకు ముందుకు వస్తే ఎలాంటి ముందస్తు అనుమతులు, సెక్యూరిటీ క్లియరెన్సులు, లైసెన్సులు అవసరం లేదన్నారు. జియోస్పేస్‌ రంగంలో నిబంధనల సడలింపు ఆత్మ నిర్భర్‌ భారత్‌లో కీలక ముందడుగని ప్రధాని మోదీ అభివర్ణించారు. హైక్వాలిటీ మ్యాప్స్‌ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న పలు రంగాలకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని సైన్స్‌అండ్‌టెక్నాలజీ మంత్రి హర్ష వర్ధన్‌ అభిప్రాయపడ్డారు.

ఇప్పటివరకు సర్వే ఆఫ్‌ ఇండియా సైతం మ్యాపులు తయారు చేయాలంటే పలు ఏజెన్సీల అనుమతులు తీసుకోవాల్సివచ్చేదని గుర్తు చేశారు. ఇంతవరకు నిషిద్ధ జోన్‌గా పేర్కొనే ప్రాంతాల జియోస్పేషియల్‌ డేటా సైతం ఇకపై అందుబాటులోకి వస్తుందని, అయితే ఇలాంటి సున్నిత ప్రాంతాలకు సంబంధించిన సమాచార వినియోగానికి సంబంధించి కొన్ని గైడ్‌లైన్స్‌ తీసుకువస్తామని తెలిపారు. ప్రజా నిధులతో సేకరించే డేటా మొత్తం దేశీయ సంస్థలకు అందుబాటులో ఉంటుందని, కేవలం సెక్యూరిటీ, లా అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలు సేకరించిన డేటా మాత్రం అందుబాటులో ఉండదని వివరించారు. తాజా మార్పులతో 2030 నాటికి రూ.లక్ష కోట్ల విలువైన జియో స్పేషియల్‌ డేటా అందుబాటులోకి వస్తుందన్నారు. కొత్త నిబంధనలు ఆహ్వానించదగినవని జియోస్పేషియల్‌ రంగానికి చెందిన ఇస్రి ఇండియా టెక్, జెనిసిస్‌ ఇంటర్నేషనల్‌ లాంటి సంస్థలు వ్యాఖ్యానించాయి.  

మరిన్ని వార్తలు