Har Ghar Tiranga:12వేల అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకం రెపరెపలు

27 Jul, 2022 13:45 IST|Sakshi

లద్దాఖ్‌: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం’లో భాగంగా ‘హర్‌ ఘర్‌ తిరంగ’కు పిలుపునిచ్చింది కేంద్రం. ఈ కార్యక్రమంలో దేశ ప్రజలు పాల్గొనాలని కోరారు ఐటీబీపీ జవాన్లు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దేశ సరిహద్దుల్లో 12వేల అడుగుల ఎత్తున త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు పలువురు జవాన్లు. ఆ వీడియోను సరిహద్దు గస్తి దళం ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. 

ఆ వీడియోలో.. లద్దాఖ్‌లోని లేహ్‌లో భూమి నుంచి 12వేల అడుగుల ఎత్తున ఉన్న కొండ చివరి భాగంలో పలువురు జవాన్లు కూర్చుని ఉన్నారు. జాతీయ పతాకాన్ని చేతబూని రెపరెపలాడిస్తూ భారత్‌ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ‘భారత్‌ మాతాకి జై. లద్దాఖ్‌లో 12వేల అడుగుల ఎత్తున ఐటీబీపీ దళాలు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాయి. 2022, ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిలో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కోరుతున్నాం.’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది ఐటీబీపీ. 

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న క్రమంలో హర్‌ ఘర్‌ తిరంగా చేపట్టాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. దానికి తగినట్లుగా ఫ్లాగ్‌ కోడ్‌కు సవరణలు చేసింది. వారంలో రోజంతా జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు వీలు కల్పించింది. అలాగే.. జెండా తయారీకి ఉపయోగించే సామగ్రి, సైజ్‌లపై ఉన్న నియంత్రణలను సైతం ఎత్తివేసింది. ఆగస్టు 13 నుంచి 15 వరకు నిర్వహిస్తోన్న హర్‌ ఘర్‌ తిరంగలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల జెండాలు ఎగురవేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: ఈడీ పోలీస్‌ విభాగం కాదు.. అయినా అరెస్టులు సరైనవే: సుప్రీం కోర్టు

మరిన్ని వార్తలు