'నాకే సలాం కొట్టవా..?' బాలునిపై కాంగ్రెస్ నేత కొడుకు దాడి

29 Aug, 2023 15:30 IST|Sakshi

ధన్‌బాద్‌: తనకు నమస్కారం చేయలేదని జార్ఖండ్ కాంగ్రెస్ నాయకుని కుమారుడు ఓ బాలునిపై దాడి చేశాడు. పిస్టల్‌తో బెదిరించి, కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

కాంగ్రెస్ నాయకుడు రణ్‌విజయ్ సింగ్ కుమారుడు రణ్‌వీర్ సింగ్. ధన్‌బాద్‌లో తాను వెళ్లే క్రమంలో నమస్కారం చేయలేదని 17 ఏళ్ల ఆకాశ్ చందల్‌ అనే బాలునిపై దాడి చేశారు. కారులో బలవంతంగా ఎక్కించి విపరీతంగా కొట్టారు. అనంతరం ఓ టీషాపు వద్దకు తీసుకెళ్లి మళ్లీ దాడి చేశారని బాధితుడు పోలీసులకు తెలిపాడు. 
 
తొమ్మిదో తరగతి చదువుతున్నానని తెలిపిన చందల్.. ట్యూషన్‌కు వెళ్లి వచ్చే క్రమంలో దాడి జరిగిందని చెప్పాడు. తాను ఓ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నిలబడగా.. ఐదు కార్లు తమ ముందుగా వెళ్లాయని తెలిపాడు. ఇంతలో కారులోంచి రణ్‌వీర్ సింగ్ దిగి తనకు నమస్కారం పెట్టమని వేధించారు. సలాం కొట్టడానికి నిరాకరించగా.. కారులోకి ఎక్కించుకుని కొట్టారని చెప్పాడు. ఓ బాడీగార్డు తనను పట్టుకెళ్లి రణ్‌వీర్ సింగ్ పాదాల వద్ద పడేశాడని పోలీసులకు తెలిపాడు. 

ఈ దాడిపై స్పందించిన కాంగ్రెస్ నాయకుడు .. రణ్‌వీర్ సింగ్‌కు ఆ గొడవకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నంలోనే ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రగా ఆయన పేర్కొన్నారు. అందులో తన కొడుకు ఉన్నట్లు ఎ‍క్కడా ఆధారాలు కూడా లేవని చెప్పారు. వీడియోపై దర్యాప్తు చేయాలని అన్నారు. 

ఇదీ చదవండి: 'పాక్‌కు ఎందుకు వెళ్లలేదు..?' విద్యార్థులపై టీచర్ అనుచిత వ్యాఖ్యలు..

మరిన్ని వార్తలు